బాంబు దాడి.. ప్రధానే లక్ష్యం.. పదుల సంఖ్యలో మరణాలు

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని లక్ష్యంగా జరిగిన బాంబు దాడి యెమెన్ దేశంలో మారణహోమం సృష్టించింది. 30 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దాడి ద్వారా ప్రధానితో పాటు నూతన మంత్రి వర్గాన్నికూడా టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. వారిలో అనేకమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని యెమెన్ అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడి నుంచి ప్రధాని సహా నూతన మంత్రివర్గం సురక్షితంగా బయటపడ్డారని యెమెన్ అధికారులు తెలిపారు.
యెమెన్‌లో తాజాగా నూతన మంత్రి వర్గం ఏర్పడింది. ప్రధాని ఎంపిక జరిగింది. ఈ నేపథ్యంలోనే వారంతా ఆదెన్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రభుత్వ పెద్దలకు ఘనంగా స్వాగతం పలకడానికి అధికారులు, ప్రజలు ఎయిర్‌పోర్టులో పెద్ద ఎత్తున వచ్చారు. ప్రధానితో పాటు మంత్రులతో వచ్చిన ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ప్రధాని మోయిన్ అబ్దుల్ మాలిక్, 10 మంది మంత్రులు విమానం దిగుతుండగా.. అక్కడ గుమిగూడిన వారంతా ఆనందంతో నినాదాలు చేస్తున్నారు. ఇంతలోనే ఊహించని విధంగా భారీ శబ్దంతో ఓ బాంబు పేలింది.
రన్‌వే దగ్గరలో ఉన్న పార్కింలోని కారు ఒకటి ఉన్నట్లుండి పేలిపోయింది. కోలాహలంతో నిండిన ఆ ప్రాంతమంతా.. అరక్షణం గడవగానే ఆర్తనాదాలతో నిండిపోయింది. బాంబు దాడిలో చనిపోయిన వారి శరీర భాగాలు తెగి చెల్లాచెదురుగా పడ్డాయి. ఒక్కసారిగా చుట్టూ పొగ అలముంకుంది. ఈ హఠాత్పరిణామంతో మిగతావారంతా ప్రాణభయంతో బయటకు వెళ్లేందుకు ముఖద్వారం వైపు పరుగులు తీశారు. ఇంతలో అక్కడ మరో బాంబు పేలింది.
కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం.. కారు పేలడానికి దుండగులు రాకెట్ బాంబును వినియోగించారు. ముఖద్వారం వద్ద కూడా బాంబు పేలిన అనంతరం దుండగులు కాల్పులకు కూడా తెగబడ్డారు. ఈ దాడికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను వణికిస్తున్నాయి. ఈ దాడికి ఇరాన్‌ అనుకూల హుతి రెబెల్స్ కారణంగా భావిస్తున్నారు.
యెమెన్‌లో గత కొన్నెళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 10 వేల మందికి పైగా సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. సుదీర్ఘ కాలంగా యెమెన్‌లో అస్థిరత్వం నెలకొంది. దీనిని అడ్డుకునేందుకే డిసెంబర్ 18న కొన్ని వేర్పాటువాద సంస్థలు, ప్రభుత్వం కలిసి ఓ కొత్త ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. పవర్ షేరింగ్ పద్ధతిలో కేబినెట్‌ను ఏర్పాటు చేశాయి. ఈ పరిణామంపై యెమెన్ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రధానిని ఆహ్వానించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఇదిలా ఉంటే బాంబు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితితో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు, విదేశీ దేశాధినేతలు ప్రకటించారు. దీనిని మూర్ఖమైన చర్యగా అభివర్ణించిన యెమెన్ నూతన ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఇలాంటి దాడులతో తమను భయపెట్టలేరని, తాము తలపెట్టిన పవిత్ర కార్యాన్ని అడ్డుకోలేరని నూతన మంత్రి వర్గం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: