సామాన్యుడి పై మరో భారం

Vasu
సామాన్యుడి పై మరో భారం

కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. వాటిపై ప్రభుత్వం నియంత్రణ శక్తిని కోల్పోయింది. దీంతో పెట్రోలియం సంస్థలు వాటికిష్టం వచ్చినంతగా ప్రతిరోజూ పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి. డీజిల్, పెట్రోల్‌ ధరలు పెరగడంతో వాటి ప్రభావం ట్రాన్స్‌పోర్టు రంగంపై పడి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. వీటి భారాన్నే మోయలేక జనం చస్తుంటే తాజాగా వంటగ్యాస్‌ ధరలను కూడా భారీగా పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది జూన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.641 ఉంటే డిసెంబర్‌ నాటికి అది రూ.756.50కు పెరిగింది. అంటే కేవలం ఆరు నెలల్లోనే 115 రూపాయలు పెరిగింది.
డిసెంబర్‌ నెలలోనే రెండుసార్లుగా రూ.100 పెరిగింది. దీనినుంచి కోలుకోవడానికే జనం నానా ఇబ్బందులు పడుతుంటే మరో వారం రోజుల నుంచి సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు వారం వారం మారనున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేసుకుంటుండడంతో వారం ప్రాతిపదికగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షించాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. ఇప్పటి వరకు నెలవారీగా సమీక్షలు నిర్వహించడం వల్ల  నష్టపోతున్నామని, అందుకే వారం వారం వీటిని సమీక్షిస్తామని ఆ సంస్థలు చెబుతున్నాయి. అంటే ఇక నుంచి వారం వారం గ్యాస్‌ ధరల్లో  వ్యత్యాసం ఉంటుంది. పెట్రోలియం ధరలను పరిశీలిస్తే ధరలు తగ్గినప్పుడు మాత్రం పైసల్లో తగ్గించి పెంచడం మాత్రం రూపాయల్లో పెంచుతున్నారు.

ఇక గ్యాస్‌ ధరలు కూడా ఇదే మాదిరిగా పెరుగుతాయోమేనని గ్యాస్‌ వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలను నిత్యావసరాలైన గ్యాస్, పెట్రోలియం ధరల నిర్ణయంపై ప్రభుత్వాలు చేతులెత్తేయడం వల్లే ఇష్టానుసారం ఆ సంస్థలు ధరలు పెంచి భారాన్ని మోపుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైమైనా గ్యాస్‌ వినియోగదారులు మరో భారాన్ని మోయాల్సి రావడం ఆందోళనకు గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: