టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

P.Phanindra
లాస్ వేగస్: అమెరికాలో ఓ వ్యక్తి రన్‌వే పైకి వచ్చి రచ్చ రచ్చ చేశాడు. రన్‌వేపై విమానం టేక్ ఆఫ్‌కు సిద్దంగా ఉన్న సమయంలో ఈ వ్యక్తి రన్‌వే పైకి వచ్చి విమానం ముందుకు కదలకుండా ఆపేశాడు. విమానం రెక్క ఎక్కి చాలా సేపు హల్‌చల్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని లాస్‌వేగాస్‌ నగరంలో ఉన్న మెక్‌కారన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్‌కు  సిద్ధంగా ఉంది.
ఈ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శనివారం లాస్ వేగస్ ఎయిర్‌పోర్ట్ నుంచి పోర్ట్‌ల్యాండ్ వెళ్లాల్సి ఉంది. విమానం టేక్‌ ఆఫ్‌కు సిద్దంగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఫెన్సింగ్ దూకి రన్‌వే పైకి దూసుకొచ్చాడు. ఎటు నుంచి వచ్చాడో తెలీదు కాని సదరు వ్యక్తి లోపలకు వచ్చి విమానం రెక్క ఎక్కేశాడు. రెక్కపై కూర్చోవడం, పడుకోవడం వంటి పనులు చేశాడు. వెంటనే విషయాన్ని తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకున్నారు.
పోలీసు అధికారులు దిగమని ఎంత సేపు అరిచినా అతడు విమానం రెక్క నుంచి కిందకు దిగేందుకు నిరాకరించాడు. అంతేకాకుండా రెక్కపై ఎగరడం వంటి పనులు చేశాడు. కాళ్లకు వేసుకున్న బూట్లను కూడా తీసేసి కిందకు విసిరేశాడు. అనంతరం రెక్క చివరన ఉండే భాగంపై ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా ఆ భాగంపైకి ఎక్కలేకపోయాడు. చివరకు అదుపు తప్పి విమానం రెక్కపై నుంచి అమాంతం కింద పడ్డాడు.
అంతే.. అధికారులు వెంటనే అప్రమత్తమై అతడిని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి ఫెన్సింగ్ దూకి రన్ వే పైకి ఎందుకు వచ్చాడన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి రన్‌వే పైకి ఏ విధంగా వచ్చాడన్నది చూస్తున్నట్టు చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: