వ్యాక్సిన్ ట్రయల్స్‌కు వచ్చి 5 అడిగాడు.. లీగల్ నోటీసులు కూడా..

yekalavya
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాక్సిన్‌లు ప్రస్తుతం తుది దశలో
ఉన్నాయి. దీనికోసం ఆయా సంస్థలు వేలాది మందిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యాక్సిన్ మూడో దశ
ట్రయల్స్ కూడా నిర్వహిస్తోంది. ఇప్పటికే అనేకమందిపై ఈ వ్యాక్సిన్‌ను
ప్రయోగించింది కూడా. అయితే ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి ఇప్పుడు
సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు షాక్ ఇచ్చాడు. దీనికోసం కోర్టుకెక్కడానికి కూడా 
సిద్ధమయ్యాడు.

కొవిషీల్డ్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఆ వ్యక్తి.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల తాను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యానని, దీనికి నష్టపరిహారంగా తనకు వెంటనే తనకు రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీకి కూడా లీగల్ నోటీసులు పంపించాడు. ఒకవేళ తనకు పరిహారం చెల్లించకపోతే వ్యాక్సిన్ బయటకు రాకుండా అడ్డుకుంటానని హెచ్చరించాడు. ఈ నోటీసులు చూసిన సీరమ్ యాజమాన్యం తలలు పట్టుకుంటోంది.

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్  ట్రయల్స్‌లో తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి పాల్గొన్నాడు.
అయితే ట్రయల్స్‌లో పాల్గొన్న తరువాత తన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని, అనేక
రుగ్మతల బారిన పడ్డానని, ట్రయల్స్‌ పేరుతో తనను అనారోగ్యానికి గురి
చేసినందుకు గానూ రూ.5 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశాడు.

అతడి తరపున న్యాయవాది ఆర్ రాజారామ్ నోటీసులు పంపించారు. ఈ సందర్భంగా
రాజారామ్ మాట్లాడుతూ, ఈ నెల 21న సీరమ్ సంస్థకు తాము లీగల్ నోటీసులు
పంపామని, అయితే వాటికి ఇంకా బదులు రాలేదని, సమాధానం వస్తే తదుపరి చర్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు. లేదంటే వచ్చే వారం కోర్టులో రిట్‌ పిటిషన్
దాఖలు చేస్తామని తెలిపారు. లీగల్ నోటీసు కాపీలను ఆక్స్‌ఫర్డ్ ట్రయల్స్
ఆస్ట్రాజెనెకా యూకే చీఫ్ ఇన్వెస్టిగేటర్‌తో పాటు శ్రీరామచంద్ర ఇనిస్టిట్యూట్ వైస్ చాన్స్‌లర్‌కు కూడా పంపినట్టు లాయర్
రాజారామ్ వెల్లడించారు.

కొవిషీల్డ్ ట్రయల్స్‌ను తొలుత యూకేలో ప్రారంభించారు. అయితే అక్కడ
నిర్వహించిన ట్రయల్స్‌లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో
ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ ట్రయల్స్‌ను రద్దు చేశారు. ఆ తరువాత
రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందిన కొవిషీల్డ్ మళ్లీ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే భారత్‌లో కూడా కొవిషీల్డ్
 ట్రయల్స్ ప్రారంభించారు. అందులో భాగంగా చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న మూడోదశ ట్రయల్స్‌లో ఫిర్యాదు దారుడు పాల్గొన్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న
తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అతడు తన నోటీసులో పేర్కొన్నాడు.


ఫిర్యాదు దారుడి నోటీసులపై శ్రీరామచంద్ర ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపల్
ఇన్వెస్టిగేటర్ ఎస్ రామకృష్ణన్ స్పందించారు. ఈ విషయంపై తాము దర్యాప్తు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ వ్యక్తిలో ప్రతికూల ప్రభావానికి
వ్యాక్సిన్ కారణం కాకపోవచ్చని, అసలు కారణాలను తెలుసుకుంటామని చెప్పారు.
నివేదికను ఎస్ఐఐకి చెందిన డేటా అండ్ సేఫ్టీ మోనిటరింగ్ బోర్డుకు
సమర్పించామన్నారు. ఇప్పటివరకైతే  ట్రయల్స్ నిలిపివేయాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, ఒకవేళ అలాంటి ఆదేశాలు అందితే వెంటనే ట్రయల్స్ ఆపేస్తామని రామకృష్ణన్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: