తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌కు పోటెత్తుతున్న భ‌క్త‌జ‌నం... కోవిడ్ కేసులు పెరిగే ఛాన్స్‌..?

Spyder
తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌కు ల‌క్ష‌లాదిగా భ‌క్త‌జ‌నం త‌ర‌లి వ‌స్తున్నారు. నదీతీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తుల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు కోవిడ్‌ నిబంధనలు విధించారు. అయితే ఎక్క‌డా కూడా నిబంధ‌న‌లు అమ‌లుకు నోచుకున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. పుష్కరస్నానాలకు వచ్చే ప్రతీ భక్తుడికి కోవిడ్‌ టెస్టు తప్పనిసరి చేయాలని స్థానిక కలెక్టర్‌ వీరపాండ్యన్‌ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఆన్‌లైన్‌లో కాకుండా.. ఆఫ్‌లైన్‌లో కూడా ఈ టికెట్లు ఇవ్వాలని సూచించారు. అయితే చాలామంది భక్తుల్లో కరోనా భయం పోయి, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా నిబంధనలకు తూట్లు పొడుతున్నారు. దీంతో అప్రమత్తమైన దేవాదాయ అధికారులు నిబంధనలకు మరింత కఠినతరం చేశారు.

కలిసికట్టుగా తిరగడం, స్నానాలను ఆచరిస్తుండడంతో అధికారులు.. మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. అసలే కార్తీకమాసం కావడంతో.. రోజురోజుకు భక్తుల సంఖ్య మరింత పెరుగుతూ పోతోంది. తుంగభద్రతీరంలో వెలిసిన ప్రసిద్ధపుణ్యక్షేత్రం మంత్రాలయానికి తరలివస్తున్న భక్తులు.. పుణ్యస్నానాలు ఆచరించి రాఘవేంద్రస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమ, శుక్రవారాలతో పాటు వీకెండ్స్‌లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు… అందరికీ స్క్రీనింగ్‌ టెస్టును మస్ట్‌ చేశారు. నగరేశ్వర స్వామి ఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డుకు కరోనా సోకడం అలజడి రేపినా…. సహచరులకు నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

దేశంలోని 12 ప్రముఖ నదుల్లో... ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం పుష్కరం జరుగుతుంది. ఈ ఏడాది తుంగభద్ర నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 20తో ప్రారంభమైన ఈ పుష్కరాలు డిసెంబర్‌ 1 వరకు కొనసాగ‌నున్నాయి. నిజానికి పుష్కరాలతో సంబంధం లేకుండా తుంగభద్రా నది ఒడ్డున ఏడాది పొడుగునా ఎక్కడో అక్కడ కల్యాణాలు, ఇతర శుభకార్యాలు జరుగుతుంటాయి. అందుకనే తుంగభద్రా నదిని పర్వదిన నదిగా భావిస్తుంటారు. సుమారు 147 కిలోమీటర్ల పొడవున పారే ఈ నది రెండు నదుల సంగమం. తుంగ, భద్రా నదులు కలిసి ప్రవహిస్తుండడం వల్ల ఈ నదికి తుంగభద్ర అనే పేరు స్థిరపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: