జగన్ ని నదిలో మునగమంటూ... చాన్నాళ్ళకు మాట్లాడిన టీడీపీ నేత...!

పరమ పవిత్రమైన తుంగభద్ర పుష్కరాల నిర్వహణను జగన్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు  బీవీ జయ నాగేశ్వర రెడ్డి ఆరోపించారు.  పరమ పవిత్రమైన తుంగభద్ర పుష్కరాల నిర్వహణను జగన్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది అని ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. రాయలసీమలో జరిగే అత్యంత ముఖ్యమైన తుంగభద్ర నదీ పుష్కరాల నిర్వహణ, పనుల పురోగతిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
తూతూ మంత్రంగా 20 రోజులు ముందు రూ.250 కోట్లు కేటాయించి, పనుల్లో పుష్కరాల నిర్వహణలో తమకు చిత్తశుద్ధి లేదని జగన్ ప్రభుత్వం నిరూపించుకుంది అని ఆయన మండిపడ్డారు. సంవత్సరం ముందు నిధులు కేటాయించి ప్రణాళికాబద్ధంగా పుష్కరాల పనులు చేయించకుండా, కంటి తుడుపు చర్యగా మమ అనిపించారు అని ఆయన విమర్శలు చేసారు. రోడ్లు గానీ, ఆలయాల అభివృద్ధికి గానీ ఎక్కడా నిధులు కేటాయించ లేదు అని విమర్శలు చేసారు. పిండ ప్రదానం చేసే భక్తులకు నదీ స్నానమాచరించే అవకాశం లేకుండా చేశారు అని ఆయన విమర్శించారు.
నదీ స్నానాలకు అవకాశం లేనప్పుడు పుష్కర ఘాట్ల పేరుతో నిధులెందుకు ఖర్చు చేశారు? అని ఆయన నిలదీశారు. ఎమ్మిగనూరు లోని త్రేతా యుగ కాలం నాటి దేవాలయాన్ని వాస్తు పేరుతో పడగొట్టారు అని ఆయన విమర్శించారు. పుష్కరాలకు హాజరవుతున్న ముఖ్యమంత్రి నదీ స్నానం చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. అప్పుడే అధికారులు ఎంత బాగా పని చేశారో, భక్తుల అవస్థలేమిటో ఆయనకు తెలుస్తాయి అని ఆయన అన్నారు. కరోనా నిబంధనల పేరుతో లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులను అడ్డుకోవడం ప్రభుత్వం వల్ల అవుతుందా? అని ఆయన నిలదీశారు. అదే విధంగా... హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా, కంటి తుడుపు చర్యగా పుష్కరాలు నిర్వహించడం సరికాదు అని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: