ఎన్నికలకు వారం మాత్రమే గడువు !

NAGARJUNA NAKKA
అమెరికాలో కీలకమైన ఎన్నికలకు వారం మాత్రమే గడువు ఉండటంతో... అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆయన కార్యవర్గం ప్రచారంలో తలమునకలైంది.  అదే సమయంలో సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో, డిఫెన్స్‌ సెక్రటరీ మార్క్‌ ఎస్పర్‌లు భారత్‌కు వచ్చేందుకు విమానం ఎక్కారు. భారత్‌తో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు.
కొవిడ్‌ కల్లోలంలో చాలా దేశాల పర్యటనలను రద్దు చేసుకొని.. వర్చువల్‌ మీటింగ్స్‌లోనే పాల్గొన్న సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో... ఇప్పుడు నేరుగా భారత్‌కు వచ్చేస్తున్నారు. రెండు దేశాలు ఉమ్మడి ముప్పుగా భావిస్తున్న చైనాను కట్టడి చేయడానికి కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. దీనికి సంబంధించిన టు ప్లస్‌ టు  చర్చలు ఢిల్లీలో ప్రారంభం కానున్నాయి.
రెండు దేశాల మధ్య జరిగే టు ప్లస్‌ టు చర్చల్లో.. విదేశాంగ శాఖ, రక్షణ శాఖ మంత్రులు తమకు సమాన హోదా వ్యక్తులతో భేటీ అవుతారు. ముఖ్యంగా రక్షణ పరమైన అంశాలు.. విదేశాంగ విధానాలపై ఎక్కువగా చర్చిస్తారు. జపాన్‌..  కీలకమైన దేశాలతో చర్చలకు ఈ విధానాన్ని అమలు చేస్తుంది. భారత్‌ కూడా అమెరికా, జపాన్‌లతో మంత్రుల స్థాయిలో 2+2 చర్చలు జరుపుతుంది. ఆస్ట్రేలియాతో మాత్రం కార్యదర్శుల స్థాయిలోనే వీటిని నిర్వహిస్తుంది.
లద్దాఖ్‌‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. భారత్‌ భద్రతా పరమైన అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. భారత్‌-అమెరికా మధ్య పరస్పర అవసరాల కోసం సమన్వయం పెంచుకోవడం.. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై దృష్టిపెట్టడం ఈ చర్చల ముఖ్య లక్ష్యమని తెలుస్తోంది. పాంపియో, ఎస్పర్లు తమ  పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌తో భేటీ కానున్నారు.  అమెరికాకు చెందిన ఉపగ్రహాలు, సెన్సర్‌లు ప్రపంచ వ్యాప్తంగా సేకరించే కీలకమైన భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో పంచుకొనేలా బేసిక్‌ ఎక్స్‌ఛేంజి అండ్‌ కోపరేషన్‌ అగ్రిమెంట్‌ పై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఒప్పందం జరిగితే భారత్‌-అమెరికాల మధ్య రక్షణ రంగ సహకారానికి అవసరమైన మూడు ఒప్పందాలు పూర్తవుతాయి. అంతకుముందే భారత్‌.. లెమోవా, కోంకాసా అనే ఒప్పందాలను చేసుకొంది. హిమాలయాల్లో సైనికులు చేరుకోవడానికి కొన్ని  రోజులు పట్టే అత్యంత కఠిన ప్రదేశాలకు సంబంధించిన స్పష్టమైన ఛాయాచిత్రాలు, వీడియోలు భారత్‌కు అందుతాయి. వీటిని అత్యంత గోప్యమైన పరికరాల ద్వారా భారత్‌.. అమెరికాలోని డేటా సెంటర్‌ నుంచి తీసుకోవచ్చు. ఈ రేఖా చిత్రాల ఆధారంగా చైనాకు చెందిన  పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు భారత్‌ తెలుసుకోవచ్చు. అప్పుడు పీఎల్‌ఏ ఆక్రమించడానికి కంటే ముందే భారత్‌ సేనలు ఆయా ప్రదేశాలను రక్షించుకోవచ్చు. మొత్తంగా చైనాకు చెక్‌పెట్టేవిధంగా భారత్‌.. చకచకా అమెరికాతో కీలక ఒప్పందాలు చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: