ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెన్స్‌ ఫైనల్‌లో ఇద్దరు దిగ్గజాలు !

NAGARJUNA NAKKA
ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు రఫెల్‌ నాదల్‌ వచ్చేశాడు. మరోసారి తనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్‌ టైటిల్‌ కోసం తలపడబోతున్నాడు. సూపర్‌ షోతో స్పెయిన్‌ బుల్‌ రొలాండ్‌ గారోస్‌ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. సెమీస్‌లో రెండో సీడ్‌ నాదల్‌ 6-3,6-3, 7-6తో  12వ సీడ్‌ డీగో ష్వార్జ్‌మన్‌ను ఓడించాడు.
మొత్తం 3 గంటల 9 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లు ఏకపక్షంగా సాగగా...చివరి సెట్‌లో మాత్రం ష్వార్జ్‌మన్‌ కొంత పోటీనివ్వగలిగాడు. మూడో సెట్‌ను కూడా ఒక దశలో వరల్డ్‌ నంబర్‌ 2 సునాయాసంగా గెలుచుకుంటాడని అనిపించింది. అయితే అర్జెంటీనా ఆటగాడు తన సర్వశక్తులూ ఒడ్డి ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేశాడు.  అయితే తుది ఫలితం మాత్రం నాదల్‌కు అనుకూలంగానే వచ్చింది. ఇక్కడ నాదల్‌ తన స్థాయి ఏమిటో చూపించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా 7 గేమ్‌లు గెలిచి ఫైనల్‌ చేరాడు.
3 ఏస్‌లు కొట్టిన నాదల్‌ ఒక్క డబుల్‌ఫాల్ట్‌ కూడా చేయలేదు. మ్యాచ్‌లో నాదల్‌ 38 విన్నర్లు కొట్టాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌కు ఇది 99వ విజయం. మరో మ్యాచ్‌ గెలిస్తే అతను 100వ విజయంతో పాటు 13వ సారి టైటిల్‌ను అందుకుంటాడు. ఇక్కడ 12 సార్లు ఫైనల్‌ చేరిన అతను 12 సార్లూ విజేతగా నిలిచాడు.
మరో సెమీస్‌లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ అతికష్టం మీద గెలిచాడు. అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ జకోవిచ్‌కు గట్టి పోటినిచ్చాడు. ఐదు సెట్ల పాటు జరిగిన హోరాహోరి పోరులో జకోవిచ్ తన అనుభవంతో సిట్సిపాస్‌ను ఓడించాడు.  జకో 6-3, 6-2, 5-7, 4-6, 6-1తో సిట్సిపాస్‌ను ఓడించాడు.
తొలి రెండు సెట్లు సులువుగానే గెలిచిన నొవాక్‌కు మూడో సెట్లో దీటుగా బదులిచ్చాడు సిట్సిపాస్‌. ఒక దశలో 5-4 ఆధిక్యంలో నిలిచిన నొవాక్‌.. వరుసగా మూడో సెట్‌ విజయంతో మ్యాచ్‌ గెలిచేసినట్లే అనుకున్నారు అభిమానులు. కానీ అక్కడి నుంచి అనూహ్యంగా పుంజుకున్న సిట్సిపాస్‌.. సెట్‌ గెలిచి జకోవిచ్‌కు షాకిచ్చాడు. నాలుగో సెట్లో ఇద్దరూ హోరాహోరీగానే తలపడ్డా చివరికి సిట్సిపాస్‌దే పైచేయి అయింది. నిర్ణయాత్మక చివరి సెట్లో హోరాహోరీ తప్పదనుకుంటే.. జకోవిచ్‌ చెలరేగిపోయి సెట్‌ను ఏకపక్షం చేసేశాడు. మూడో గేమ్‌లోనే బ్రేక్‌ సాధించిన అతను.. 5, 7 గేమ్‌ల్లో బ్రేక్‌లతో అలవోకగా సెట్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.‌
ఫైనల్‌లో ఇద్దరూ టాప్‌ ప్లేయర్స్‌ తలపడనున్నాడు. నాదల్‌, జకోవిచ్‌లు ఎవరూ గెలిచినా రికార్డుల మోత మోగడమే. నాదల్‌ గెలిస్తే రికార్డు స్థాయిలో 13 వ సారి ఫ్రెంచ్ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకుంటాడు. జకోవిచ్‌ గెలిస్తే కెరీర్ గ్రాండ్‌ స్లామ్‌ రెండు సార్లు గెలిచినా ఏకైక ప్లేయర్‌గా చరిత్రలో నిలుస్తాడు. దీంతో ఈ మెగా సమరం కోసం టెన్నిస్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: