నా నిబద్ధతను నిరూపించిన తీర్పు ఇది..‌ - ఎల్ కే అద్వానీ

SS Marvels
దేశంలో సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తుది తీర్పు వెలువడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ సహా సీనియర్ నేతలందరినీ నిర్దోషిగా తేల్చింది. ఆ వెంటనే కోర్టు బయట ‘జై శ్రీరామ్’ నినాదాలు మిన్నంటాయి. వయోభారం కారణంగా న్యాయస్థానానికి హాజరు కాలేకపోయిన అద్వానీ.. కోర్టు తీర్పు అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలకు, రామ మందిరం ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

‘వ్యక్తిగతంగా, పార్టీ (బీజేపీ) పరంగా రామ జన్మభూమి ఉద్యమం పట్ల నా నిబద్ధతను ఈ తీర్పు నిరూపించింది. ఇది చరిత్రాత్మకమైన తీర్పు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బాటలు వేస్తూ సుప్రీంకోర్టు 2019 నవంబర్‌లో చరిత్రాత్మక తీర్పు వెలువరించిన మార్గంలోనే ఈ తీర్పు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో భారతీయుల చిరకాల వాంఛ అయిన రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయిందని అద్వానీ అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న అయోధ్యలో మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

‘అయోధ్య ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలు, సన్యాసులందరికీ కృత‌జ్ఞతలు. వారి నిస్వార్థ పోరాటం, త్యాగమే నాకు స్ఫూర్తిని, మద్దతును ఇచ్చాయి’ అని అద్వానీ పేర్కొన్నారు. తీర్పు వెలువడిన వెంటనే ‘జై శ్రీరాం’ అని చాంట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో తన తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులకు కూడా అద్వానీ కృత‌జ్ఞతలు తెలిపారు. ‘మహిపాల్ అహ్లూవాలియా నేతృత్వంలోని లీగల్ టీమ్ ఈ కేసులో వాదనలు వినిపించడానికి విశేష కృషి చేసింది. మహిపాల్ అహ్లూవాలియా, ఆయన కుమారుడు అనురాగ్ అహ్లూవాలియా ఏళ్లుగా ఈ కేసులో అకుంఠిత దీక్షతో అన్ని అంశాలను పరిశీలించి వాదనలు వినిపించారు’ అని అద్వానీ పేర్కొన్నారు.కోట్లాది మంది దేశవాసులతో పాటు తాను కూడా అయోధ్యలో సుందరమైన రామ మందిర నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నానని అద్వానీ పేర్కొన్నారు. ‘శ్రీరామచంద్రుడు అందరిపై తన చల్లని చూపులను ఎప్పుడూ కురిపిస్తాడు..’ అంటూ తన లేఖను ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: