కాంగ్రెస్ ను సెట్ చేసారా బాస్ ?


రోజు రోజుకి తెలంగాణలో ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్ కి తిరిగి పునర్వైభవం తీసుకు వచ్చే విధంగా, కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మనిక్కం ఠాగూర్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో పార్టీ కీలక నాయకులు అందరితోనూ అనేక సమావేశాలు నిర్వహించి పార్టీని ఏ విధంగా జనాల్లోకి తీసుకువెళ్లాలి ?ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి పార్టీ నాయకులంతా ఐక్యంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఇలా అనేక అంశాలపై ఆయన మూడు రోజుల పాటు పార్టీ నాయకులకు హిత బోధ చేశారు. అంతేకాకుండా తెలంగాణలో పార్టీ పటిష్టం అవడానికి అనేక సూచనలు చేశారు.


 ఈ సందర్భంగా తెలంగాణ సీనియర్ నాయకులకు సంబంధించి పార్టీ పరిస్థితుల గురించి, ఇక్కడ లోటుపాట్లను గురించి కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పించేందుకు ఒక రిపోర్టు ఆయన తయారు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో వరుస వరుసగా ఎన్నికలు జరగబోతూ ఉండడం, ఎన్నికలను పార్టీ శ్రేణులు సీరియస్ గా తీసుకుని  పార్టీకి విజయం అందించాలని, సీనియర్ నాయకులంతా పార్టీలో ఉత్సాహం తీసుకువచ్చే విధంగా వ్యవహరించాలని, పార్టీ నాయకులు ఎవరూ, ఇతర పార్టీలోకి చేజారిపోకుండా జాగ్రత్త గా చూడాలని, ఇలా ఎన్నో సూచనలు చేశారు. 


తెలంగాణ కాంగ్రెస్ పై ప్రజల్లో ఆదరణ ఉందని, కానీ దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో నాయకులు విఫలమవుతున్నారనే విషయాన్ని ఠాకూర్ గుర్తించారు. ఠాగూర్ తెలంగాణ లో అడుగుపెట్టిన తర్వాత రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు, జిల్లాల వారీగా అనేక మందితో సమావేశమై అనేక విషయాలపై వారి సందేహాలను తీర్చాడు. ఆయన రాకతో రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం కనిపించింది. ఠాకూర్ తెలంగాణకు సంబంధించి ఎన్నో విషయాలపై ఒక క్లారిటీ కి వచ్చారని, పార్టీకి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేయడంతోపాటు, సమిష్టిగా నాయకులందరూ పార్టీపై సీరియస్గా దృష్టి పెడితే , 2023 ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తుందనే, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: