మావో పార్టీ ఆవిర్భావ వారోత్సవాలకు పిలుపు..!

NAGARJUNA NAKKA
నక్సలైట్లు మావోయిస్టు పార్టీతో విలీనం అయ్యి 16సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలను మావోయిస్టులు జరుపుకుంటున్నారు. ఆంధ్రా - ఒడిశా బోర్డర్ లో కొన్నిరోజులుగా వారోత్సవాలను విజయవంతం చేయాలని, ప్రజాపోరాటంలో చేరాలని పిలుపునిస్తూ పెద్ద ఎత్తున కరపత్రాలు పంచి పెట్టారు మావోయిస్టులు. ఆవిర్భావదినోత్సవ వేడుకల సమయంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు నక్సలైట్లు ప్రయత్నిస్తున్నారనే సమాచారం పోలీసులకు ఉంది. ఈ తరుణంలో ఏవోబిలో కూంబింగ్ విస్తృతంగా జరుగుతోంది. అదనపు బలగాలను జిల్లా యంత్రాంగం రంగంలోకి దించింది. బాంబు స్క్వాడ్ లు, ప్రత్యేక బలగాలు ముంచింగిపుట్టు, పెద్దబయలు, జీ.కే.వీధి, చింతపల్లి సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నాయి. దీంతో ఏక్షణాన ఏమి జరుగుతుందోనని ఉత్కంఠ కొనసాగుతోంది. మావోయిస్టులను నిలువరించేందుకు పోలీసులు సమర్ధవంతమైన వ్యూహాంతో అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నారు.
సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరోమారు అలజడి నెలకొంది. ఎదురుకాల్పులు, బంద్‌లు, మందుపాతర పేలుళ్ల వంటి వరుస ఘటనలతో వాతావరణం వేడెక్కింది. దాదాపు పుష్కరకాలం తర్వాత మావోయిస్టుల కదలికలు మళ్లీ ఊపందుకున్నాయి. రిక్రూట్‌మెంట్ల కోసం సరిహద్దు జిల్లాల్లో మూడు మావోయిస్టు బృందాలు రంగంలోకి దిగడం..ఉనికి చాటుకునేందుకు పోలీసులకు సవాలు విసురుతున్నారు. వారి ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు పోలీసు బలగాలు అడవుల్లో విస్తృతంగా కూంబింగ్‌ చేస్తున్నాయి. ఏకంగా డీజీపీ రంగంలోకి దిగి క్షేత్రస్థాయి శ్రేణుల్ని సమాయత్తం చేయడం.. సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి.
ఈ రోజు నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోవాలంటూ,  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ పిలుపు ఇవ్వడంతో తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో మూడు నెలల క్రితం వరకు పరిస్థితి ప్రశాంతంగానే కనిపించింది.  ఆ తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి బస్వరాజ్‌ ఆదేశాలతో తెలంగాణలో పట్టు సాధించేందుకు రాష్ట్ర కమిటీ సభ్యులు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ ఆసిఫాబాద్‌ అడవుల్లో, కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లో, కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ భూపాలపల్లి, ములుగు అడవుల్లో సంచరిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: