గోదావరి జిల్లాలలో గెలుపెవరిది ?

Chowdary Sirisha
సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ ఒకేవైపు మొగ్గుచూపించే గోదావరి జిల్లాలు ఈసారి ఎటూ మొగ్గుచూపించే పరిస్థితి కనిపించటం లేదు. తెలుగుదేశం, వైసిపి అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొనటమే ఇందుకు కారణం. గోదావరి జిల్లాలు ఏ పార్టీవైపు మొగ్గు చూపిస్తే, ఆ పార్టీ విజయం సాధిస్తుందన్న అభిప్రాయం చాలా కాలంగా ఉంది. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. అభ్యర్థులను ఎంపికచేయటంలో తెలుగుదేశం పార్టీ చేసుకున్న పొరపాట్ల కారణంగా మున్సిపల్ ఎన్నికల నాటి తెలుగుదేశం గాలి, ఇపుడు కనిపించటంలేదు. అయినా సరే సర్దుబాట్లు చేసుకుంటూ గట్టి పోటీనిచ్చే స్థాయికి తెలుగుదేశం పార్టీ ఎదిగింది. ఉభయగోదావరి జిల్లాల్లోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో పరిస్థితి దాదాపు అలాగే ఉంది. రాజమండ్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి మురళీమోహన్‌కు జనంలో సానుభూతి ఉన్నప్పటికీ, అసెంబ్లీ సెగ్మంట్లలోని ఇబ్బందులు ఆయనకు నష్టం కలిగించేలా ఉన్నాయి. అయినా సరే జనం మురళీమోహన్‌కే మద్దతు పలికితే మాత్రం గట్టెక్కేందుకు అవకాశం ఉంటుంది. వైసిపి అభ్యర్ధి బొడ్డు వెంకటరమణకు అసెంబ్లీ అభ్యర్ధుల బలమే ఆధారంగా కనిపిస్తోంది. అభ్యర్ధుల ఎంపికలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవటంతో ఆయన ప్రచారంపైనే దృష్టిపెట్టి ముందుకు సాగుతున్నారు. ఆయన తండ్రి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అసలు రాజకీయాన్ని పర్యవేక్షిస్తుండటంతో, వెంకటరమణ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా హాయిగా ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి కందుల దుర్గేష్ సామాజికవర్గాల సమీకరణపైనే ఆధారపడ్డారు. కాంగ్రెస్ పట్ల జనంలో కోపం ఎలా ఉన్నాగానీ, తన వరకు తాను ఓటర్లను ఆకట్టుకోవటంలో దుర్గేష్ విజయం సాధిస్తున్నారు. అమలాపురంలో స్థానికేతురుడన్న ఆరోపణలను తెలుగుదేశం అభ్యర్ధి రవీంద్రబాబు ఎదుర్కొంటుంటే, వైసిపి అభ్యర్ధి పినిపె విశ్వరూప్ మాత్రం అందరి మద్దతును కూడగట్టుకోగలుతున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపి జివి హర్షకుమార్ గట్టి పోటీనిస్తున్నారు. కాకినాడలో మాజీ మంత్రి తోట నరసింహం, వైసిపి అభ్యర్ధి చెలమలశెట్టి సునీల్ నువ్వా? నేనా? అన్నట్టు పోటీపడుతున్నారు. నర్సాపురం లోక్‌సభలో బిజెపి అభ్యర్ధి గోకరాజు గంగరాజుకు అసెంబ్లీ సెగ్మంట్ల నుండి ఆశించిన మద్దతు లభించటం లేదు. అలాగని వైసిపి అభ్యర్ధి వంకా రవీంద్రనాథ్‌కు ఏకపక్షంగా అనుకూలంగా లేదు. ఇక్కడ బిజెపి, వైసిపి గట్టిపోటీని ఎదుర్కొంటున్నాయి. ఏలూరులో తెలుగుదేశం అభ్యర్ధి మాగంటి బాబు, వైసిపి అభ్యర్ధి తోట చంద్రశేఖర్ మధ్య నువ్వా? నేనా? అన్నట్టు పోటీ సాగుతోంది. అసెంబ్లీ రాజకీయానికొచ్చే సరికి తెలుగుదేశం పార్టీ అంతర్గత సమస్యలతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నప్పటికీ, ఇంకా సర్దుబాట్లు చేసుకోలేకపోతోంది. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి పోటీని తెలుగుదేశం ఎదుర్కొంటోంది. కోనసీమలో కూడా వైసిపి, తెలుగుదేశం మధ్య పోటీ గట్టిగా సాగుతోంది. రాజోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోటీచేయటం తెలుగుదేశంకు కలిసొచ్చేలా ఉంది.రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పార్టీకి చెందిన అసెంబ్లీ అభ్యర్ధికి ఓటేసినప్పటికీ, మరో పార్టీకి చెందిన లోక్‌సభ అభ్యర్ధికి ఇక్కడ ఓట్లేసే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశంను బాగా దెబ్బతీస్తుందనుకున్న అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంపై ఆ పార్టీ పెద్దలంతా గురిపెట్టడంతో అక్కడ పరిస్థితి దేశంకు కాస్తంత అనుకూలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న ఇండిపెండెంట్లు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తారో తెలియకుండా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని ఇప్పటికీ అంతర్గత సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దాంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి దెబ్బతగిలేలా కనిపిస్తోంది. ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఏ పార్టీకాపార్టీ తమ అభ్యర్ధుల తరపున ప్రచారం సాగిస్తూ పోరాటం సాగిస్తుండటంతో ఇక్కడ ఓటర్లు ఎటు మొగ్గుచూపిస్తారో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: