మురళీమోహన్ కు రాజమండ్రిలో ఎదురుగాలి!

Chowdary Sirisha
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్ధృతంగా వీచిన తెలుగుదేశం గాలి ఇపుడు దిశ మార్చుకుంది. రాజమండ్రి లోక్‌సభలో తిరుగులేదని భావించిన ఆ పార్టీకి, ఇపుడు ఎదురుగాలి వీస్తోంది. అసెంబ్లీ సెగ్మంట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అంతర్గత సమస్యలు తెలుగుదేశం పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా సినీనటుడు మురళీమోహన్, వైసిపి అభ్యర్ధిగా బొడ్డు అనంతర వెంకట రమణ చౌదరి, కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్, జెఎస్‌పి అభ్యర్ధిగా ముళ్లపూడి సత్యనారాయణతో కలిసి 14మంది పోటీచేస్తున్నారు. నియోజకవర్గం ఉభయగోదావరి జిల్లాలకు విస్తరించి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ సెగ్మంట్లు ఉన్నాయి. రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానం లోక్‌సభ ఎన్నికలపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. వైసిపి మాత్రం మొదటి నుండి వ్యూహాత్మకంగా కదులుతూ, అభ్యర్ధుల ఎంపిక తరువాత ఊహించని విధంగా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బిజెపి పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ టిక్కెట్టును ఆశిస్తున్న మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ అసెంబ్లీని టిక్కెట్టు కేటాయించటంతో గందరగోళం ఏర్పడింది. దాంతో బిజెపి అభ్యర్ధికి ఆశించిన మద్దతు తెలుగుదేశం పార్టీ నుండి ఎంత వరకు లభిస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. రెండు పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇచ్చేలా లేవు. టిడిపికి మొదటి నుండి సింహస్వప్నంగా ఉన్న అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎలాగూ ఉండనే ఉంది. రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చటం, టిక్కెట్టు ఆశించిన నాయకులకు మొండి చేయి చూపించటంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలులో కూడా ‘దేశం’ ఎదురీదుతోంది. వైసిపి అభ్యర్ధి బొడ్డు వెంకటరమణ చౌదరికి అసెంబ్లీ సెగ్మంట్ల నుండి ఎలాంటి ఇబ్బందులు లేవు. అదే రాజమండ్రి లోక్‌సభలో ఆ పార్టీకి బలంగా కనిపిస్తోంది. మరోపక్క ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్ధులు పోటీపడుతుండటంతో, మధ్యలో మరో బలమైన సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్ధి కందుల దుర్గేష్ సామాజికవర్గ సమీకరణలపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: