హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తిరుపతిపై భూమనకు పట్టు దొరికినట్లేనా..

M N Amaleswara rao

2019 ఎన్నికల్లో భారీగా జగన్ గాలి ఉన్నా సరే కొంతమంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు స్వల్ప మెజారిటీలతో బయటపడ్డారు. అలా అత్యల్ప మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒకరు. 2019 ఎన్నికల్లో తిరుపతి బరిలో దిగిన భూమన కేవలం 708 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి ఎం.సుగుణమ్మపై విజయం సాధించారు. అయితే గెలవడానికి తక్కువ మెజారిటీతో గెలిచిన భూమన, నిదానంగా తిరుపతిపై పట్టు పెంచుకునే దిశగా వెళుతున్నారు.

 

అధికార పార్టీ ఎమ్మెల్యేగా తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చేస్తున్నారు. ఆధ్యాత్మికత ప్రాంతం తిరుపతి ముందు నుంచే అభివృద్ధి అవుతూ వచ్చింది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా తిరుపతిపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ది చేసుకుంటూ వెళుతోంది.

 

భూమన ఇక్కడ రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. సమస్యలు ఎవరికున్న వాటిని పరిష్కరించడానికి చూస్తున్నారు. ఇటీవల నిర్భందంలో ఉన్న అభ్యుదయ రచయిత వరవరరావుని విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు లేఖ రాసి, మానవత్వం చాటుకున్నారు.

 

రాజకీయపరంగా చూసుకుంటే తిరుపతిలో భూమన స్ట్రాంగ్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా తిరుపతి ప్రజలకు చేరువయ్యారు. ఇక్కడ టీడీపీ మరీ వీక్ అయిపోయిందనే చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదని తెలిసింది. తన భర్త వెంకటరమణ మృతితో రాజకీయాల్లోకి వచ్చిన సుగుణమ్మ 2015 తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ తరుపున నిలిచి, దాదాపు లక్షా 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి సత్తా చాటారు.

 

అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో సుగుణమ్మ తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేశారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఉండటంతో సుగుణమ్మ 708 ఓట్ల తేడాతో భూమన చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక సుగుణమ్మ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు ఏమి చేయకపోవడంతో కొందరు టీడీపీ కార్యకర్తలు భూమన వైపుకు వచ్చేశారు. దీంతో తిరుపతిలో భూమనకు బలం పెరిగింది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: