పాణ్యం పాలిటిక్స్: దూసుకెళుతున్న కాటసాని..

M N Amaleswara rao

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం...కాటసాని రాంభూపాల్ రెడ్డికి కంచుకోట. ఇక్కడ ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే విజయం. 1985 నుంచి పాణ్యంలో ఆయన హవానే నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన కాటసాని..1985లో పాణ్యంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 

ఇక అక్కడ నుంచి చూసుకుంటే 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన చేసి ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి, 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, అప్పుడు వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో ఉన్న గౌరు చరితారెడ్డి చేతిలో కేవలం 11 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల ముందు జగన్ ఆహ్వానం మేరకు వైఎస్సార్‌సీపీలో చేరారు.

 

ఇదే సమయంలో గౌరు చరితా వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలోకి వెళ్లారు. దీంతో 2019 ఎన్నికల్లో కాటసాని వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి గౌరుపై దాదాపు 43 వేల ఓట్ల తేడాతో గెలిచి సత్తా చాటారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని పాణ్యం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. పాణ్యంలోని ప్రతి గ్రామంపై పట్టున్న కాటసాని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు ప్రభుత్వ పథకాలని ఎలాంటి లోటు లేకుండా అందిస్తున్నారు.

 

నిత్యం నియోజకవర్గంలో ఏదొక గ్రామంలో పర్యటిస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కొత్తగా సి‌సి రోడ్ల నిర్మాణం, అండర్ డ్రైనేజ్‌లు, సచివాలయ నిర్మాణాలు చేస్తున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు సరఫరా చేసి పేద ప్రజలని ఆదుకున్నారు. నియోజకవర్గంలో కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. తాజాగా కూడా వరదముప్పు ఉన్న హంద్రీనీవా పరివాహక ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప్రజలని అప్రమత్తం చేశారు. ఎలాంటి ఇబ్బంది వచ్చిన తనకు నేరుగా ఫోన్ చేసి సంప్రదించవచ్చని ప్రజలకు ధైర్యం చెప్పారు.

 

అయితే ఇక్కడ కాటసాని దూకుడుకు ప్రతిపక్షాల అడ్రెస్ గల్లంతు అయిపోయిందనే చెప్పొచ్చు. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పాణ్యంలో వైఎస్సార్‌సీపీ దాదాపు 90 శాతం పైనే స్థానాలు గెలిచేలా కనిపిస్తోంది. మొత్తానికైతే పాణ్యంలో కాటసాని దూసుకెళుతూ, ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ కాటసాని విజయానికి బ్రేకులు వేయడం ఏ ప్రతిపక్ష పార్టీకి సాధ్యం కాదని అర్ధమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: