పెద్ద దిక్కుని కోల్పోయిన పరిటాల కుటుంబం

మాజీ మంత్రి, దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మామగారు, మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండన్న తుదిశ్వాస  విడిచారు. కొద్ది సేపటి క్రితం అనంతపురం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు కొండన్న. ఆయన నసన కోట ముత్యా లమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గా సుదీర్ఘ కాలం పని చేసారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర మరణానంతరం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన. కొండన్న మృతితో పరిటాల కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

 

ముందు నుంచి కూడా పరిటాల కుటుంబానికి ఆయన అండగానే ఉన్నారు. సునీత... రవిని ప్రేమ వివాహం చేసుకున్న సమయంలో ఆమెకు ఏ విధంగా కూడా  కొండన్న అడ్డు చెప్పలేదు. రవి కష్టాల్లో ఉన్న సమయంలో కూడా ఆయనకు తన వంతుగా సహాయ సహకారాలు అందించారు. పార్టీ కోసం ఆయన సుధీర్గ కాలం పాటు పని చేసారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న సమయంలో, బలహీనంగా ఉన్న సమయంలో కార్యకర్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆయన వారికి అండగా ఉంటూ వచ్చారు. 

 

రవి మరణం తర్వాత కేసులు పెట్టి, ఆయన కోర్టుల చుట్టూ తిరిగి నిందితుల మీద పెద్ద పోరాటమే చేసారు. పీపుల్స్ వార్ రవికి అండగా ఉన్న సమయంలో కూడా కుటుంబానికి అన్ని విధాలుగా ఆయన సహకారం అందించారు. రాజకీయాల్లో రవి బిజీ గా ఉండటం, పిల్లలకు ఫ్యాక్షన్ లో ప్రమాదం ఉండటం తో వారి బాధ్యతలను ఎక్కువగా కొండన్న చూసుకున్నారు. పరిటాల శ్రీరాం కి ఆయన తాత అంటే ఎనలేని అభిమానం అని పరిటాల కుటుంబ సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఇక తండ్రి మరణం తో సునీత కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: