చంద్రబాబుకు జగన్ మరో షాక్... సొంత జిల్లాలో ఊహించని పరాభవం...?

Reddy P Rajasekhar

ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. వైసీపీ అభ్యర్థులు చిత్తూరు జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత నియోజకవర్గం శ్రీకాళహస్తిలో 64 ఎంపీటీసీ స్థానాలను, 4 జడ్పీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.  చిత్తూరు జిల్లాలో 65 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 29 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  858 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 323 మంది అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

పుంగనూరు నియోజకవర్గంలో అన్ని జడ్పీటీసీ స్థానాల్లోను వైసీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. తిరుపతి కార్పొరేషన్ లోని 16 వార్డుల్లో వైసీపీ కార్పొరేటర్లు , పలమనేరు మున్సిపాలిటీలో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనాన్ని ఆపాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు సఫలం కావట్లేదు. 
 
చంద్రగిరి నియోజకవర్గంలో 95 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 86 ఎంపీటిసీలు వైసీపీకే దక్కటంతో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, స్థానిక ఎమ్మెల్యే కృషి వల్లే ఈ ఫలితాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. చిత్తూరులోని తంబళ్లపల్లెలో అన్ని స్థానాలు ఏకగ్రీవం కావడం గమనార్హం. నియోజకవర్గంలోని 72 ఎంపీటీసీ స్థానాలలో 71 స్థానాలలో వైసీపీ, ఒక స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 
చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఎన్నికలకు ముందే మెజారిటీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవటం గమనార్హం. కృష్ణా జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకోగా గన్నవరంలోని ఉంగుటూరు జడ్పీటీసీ స్థానం నుండి దుట్టా సీతారామలక్ష్మి... కైకలూరు మండలం మండవల్లి జడ్పీటీసీ స్థానం నుండి ముంగర విజయనిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముందే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉండటం చంద్రబాబుకు సొంత జిల్లాలోనే ఊహించని పరాభవం అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: