బస్సెక్కినా.. రైలెక్కినా.. ఉచిత ప్రయాణం..!

NAGARJUNA NAKKA

బస్సెక్కినా.. రైలెక్కినా.. ఎక్కడ నుంచి ఎక్కడికైనా.. ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది లక్సెం బర్గ్‌. ట్రాఫిక్ జామ్‌లు తగ్గించేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రయాణం అందించడం వల్ల ఆదాయపరంగా నష్టాలు ఉన్నా.. మొత్తంగా చూస్తే లాభమే అంటున్నారు అధికారులు. 

 

యూరోపియన్ యూనియన్‌లో చాలా చిన్న దేశం లక్సెంబర్గ్‌. జనాభా ఆరు లక్షలు. బహుళ జాతి కంపెనీలకు కేంద్రం. లక్సెంబర్గ్ చిన్న దేశమే కాదు.. సంపన్న దేశం కూడా. ఈ దేశంలో 69 శాతం జనాభాకు కార్లు ఉన్నాయి. వేల సంఖ్యలో కార్లు ఒక్కసారిగా రోడ్ల మీదకు రావడంతో కాలుష్యం పెరగడంతో పాటు.. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో విలువైన పని గంటలు ట్రాఫిక్‌ జామ్‌లలో కలిసిపోతున్నాయి. కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి .. ఉచిత ప్రజా రవాణా తీసుకొచ్చింది లక్సెంబర్గ్ ప్రభుత్వం.

 

2016 లెక్కల ప్రకారం ప్రతి 1000 మందిలో 662 మందికి ఈ నగరంలో కార్లున్నాయి. యూరోప్ నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా ఉన్న నగరాల్లో లక్సెంబర్గ్ ఒకటి. ఇక్కడ కారు నడిపే డ్రైవర్లు ఏడాదిలో 33 గంటలు ట్రాఫిక్ లో చిక్కుకుని ఉంటారని ఆ ప్రభుత్వమే చెబుతోంది. లక్సెంబర్గ్‌తో సమానంగా జనాభా ఉన్న కోపెన్ హెగన్, హెల్సింకీల్లో  లక్సెంబర్గ్‌తో పోలిస్తే ట్రాఫిక్ సమస్యలు చాలా తక్కువ.

 

లక్సెంబర్గ్‌లో ప్రతీ మూలకూ బస్సులు, ట్రామ్‌లు, మెట్రో రైళ్లు ఉన్నాయి. అయితే వీటిల్లో ఎక్కే వారు చాలా తక్కువ. అంతా సొంత కార్లలోనే వెళుతుంటారు. వ్యక్తిగత వాహనాల వాడకం వల్ల సమస్యలు పెరగడంతో.. ప్రభుత్వం ఉచిత ప్రయాణ ఆఫర్ తీసుకొచ్చింది. ఉచిత ప్రయాణం వల్ల ఒక్కో ప్రయాణికుడికి నెలకు 8వేల రూపాయలు ఆదా అవుతుంది.

 

యూరప్ లో అత్యధిక పర్ క్యాపిటా ఉన్న దేశం లక్సెంబర్గ్. దేశ రాజధాని లక్సెంబర్గ్ నుంచి బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీలకు కారేసుకుని గంటలో వెళ్లిపోవచ్చు. ఈ మూడు దేశాలనుంచి ప్రతీ రోజూ రెండు లక్షల మంది లక్సెంబర్గ్ సిటీకి  ఉద్యోగాలు చేసేందుకు వస్తుంటారు. దీంతో కార్లతో నగరం కిటకిటలాడిపోతూ, ట్రాఫిక్ సమస్యతో, కాలుష్యంతో సతమతమవుతోంది. ఆర్థికంగా భారమైనా, ప్రజల ఆరోగ్యం, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశం మొత్తం టికెట్‌ లెస్ ట్రావెల్ స్కీమ్ తీసుకొచ్చింది. 

 

లక్సెంబర్గ్ లో అన్ని రకాల రవాణా సదుపాయలను నడిపేందుకు ప్రభుత్వానికి ఏడాదికి 562 మిలియన్లు డాలర్లు ఖర్చవుతున్నాయి. ఇందులో టికెట్ల అమ్మకాల వల్ల వస్తోన్న ఆదాయం 46 మిలియన్ డాలర్లు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉండటంతో ప్రజలకు ఉచిత రవాణా ఇవ్వడం వల్ల పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: