13 ఏళ్ల బాలిక‌ను రు.7 ల‌క్ష‌ల‌కు సేల్ చేశారు... 4 నెల‌ల గ‌ర్భ‌వ‌తి

VUYYURU SUBHASH
బిడ్డ‌ను కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన తండ్రే కాసులకు కక్కుర్తి ప‌డి..కాసాయి వాళ్ల‌కు అమ్మేసిన సంఘ‌ట‌న రాజస్థాన్ బర్మార్ జిల్లాలో జ‌రిగింది. స‌ద‌రు 13 ఏళ్ల బాలిక‌ను హైద‌ర‌బాద్‌లో పోలీసులు గుర్తించారు. అయితే అప్ప‌టికే ఆ బాలిక నాలుగు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అని తెలియ‌డంతో నిర్ఘాంత‌పోయారు. అభం శుభం తెలియ‌ని చిన్నారి జీవితాన్ని నాశ‌నం చేసిన క‌న్న‌తండ్రిని.. బాలిక‌ను కొనుగోలు చేసి.. కిడ్నాప్ చేసిన మ‌రో ఇద్ద‌రు నిందితులను రాజ‌స్థాన్ పోలీసులు హైద‌ర‌బాద్‌లో అరెస్ట్ చేశారు.బాలిక‌ను పోలీసులు బర్మార్‌కు తీసుకెళ్లి త‌ల్లికి అప్ప‌గించారు. ఈ నెల 15న బాలికను కోర్టు ముందు ప్రవేశపెడతామ‌ని బర్మార్‌ ఎస్పీ శరద్‌ చౌదరి తెలిపారు.


బాలిక‌ తప్పిపోయినట్టు సివానా పోలీసు స్టేషన్‌లో జూన్‌ 30వతేదీన చిన్నారి బాబాయి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ఆరంభించారు. ఈ కేసు ఆరంభం నుంచి బాలిక తండ్రిపైనే అనుమానాలు క‌ల‌గ‌డంతో ఆయ‌న్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ముందు ఎవ‌రో బాలిక‌ను కిడ్నాప్ చేశార‌ని బుకాయించినా పోలీసులు త‌మ స్టైల్‌లో విచారించ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. బాలిక‌ను రూ.7ల‌క్ష‌ల‌కు దళారి గోపరామ్‌ మాలి ద్వారా సన్వ్లా రామ్‌ దస్పా అనే వ్య‌క్తికి అమ్మేసిన‌ట్లు నేరాన్ని అంగీక‌రించాడు. జూలై మొదటివారంలోనే బాలిక తండ్రితోపాటు దళారి గోపరామ్‌ మాలి, బాలికను కొనుగోలు చేసిన సన్య్లా రామ్‌ దస్పాను పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపారు.


అయితే బాలిక ఆచూకీ మాత్రం పోలీసులు క‌నుగొన‌లేక‌పోయారు. బాలిక త‌మ నుంచి పారిపోయిదంటూ నిందితులు చెప్ప‌డంతో రాజ‌స్థాన్‌లోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు గాలింపులు చేప‌ట్టారు. నాటి నుంచి ఎక్క‌డా బాలిక ఆచూకీ  తెలియ‌రాలేదు. అయితే హైద‌రాబాద్‌లో ఉన్న‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం అంద‌డంతో రాజ‌స్థాన్ పోలీసులు ఇక్కడికి వ‌చ్చి బాలిక‌ను గుర్తించారు. బాలికతో పాటు ఉన్న దస్పా కొడుకుపై సెక్షన్‌ 363 (కిడ్నాప్‌), 366 (మహిళను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవడం), 384 (ఎక్స్‌టార్షన్‌) తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: