పార్టీ మారి ప‌త‌నం అయ్యారు.. లేకుంటే వైసీపీ కింగ్‌లు వీళ్లే..

VUYYURU SUBHASH
తన్నితే బూరెల బుట్టలో పడ్డాడు రా అన్న సామెత ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచినాన‌ కొందరు నేతలకు అక్షరాలా సరిపోతుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వారిలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ కండువా మార్చేశారు. 2014 ఎన్నికల తర్వాత వైసిపి చాలా డిఫెన్స్ లో పడింది. ఈ టైంలో మళ్లీ జగన్ గెలుస్తారా ? అన్న సందేహాలు చాలా మందికి వ్యక్తమయ్యాయి. ఈ టైమ్‌లోనే వైసీపీలో ఉంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని డిసైడ్ అయిన చాలా మంది సైకిల్ ఎక్కేశారు. వీరిలో కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌గా మ‌రికొంద‌రు ఇతర‌త్రా లాభాలు పొందారు. అలా పార్టీ మారి పోటీ చేసిన నేత‌ల్లో ఈ ఎన్నిక‌ల్లో ఒక‌రిద్ద‌రు మిన‌హా  అంద‌రూ చిత్తుగా ఓడిపోయారు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ లాంటి వాళ్లు మాత్రమే పార్టీ మారినా పర్సనల్ ఇమేజ్ తో గట్టెక్కారు. 


ఈ క్రమంలో  తూర్పు గోదావరి జిల్లా నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి పార్టీ మారిన వారందరూ ఈ ఎన్నికలలో ఓడిపోయారు. అయితే అనూహ్యంగా ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వెళ్ళిన వారందరూ విజయం సాధించారు. వైసీపీలోకి కీలక నేతగా ఉన్న జ్యోతుల నెహ్రూ 2014లో జగ్గంపేట నుంచి గెలిచి ఆ తర్వాత ఆ పార్టీలో ఇమడలేక టిడిపిలో చేరారు. ఇక్కడ మంత్రి పదవి వస్తుందని నెహ్రూ ఆశలు పెట్టుకున్నా చంద్రబాబు పదవి ఇవ్వలేదు. నెహ్రూను నమ్ముకుని పార్టీ మారిన ఆయన తోడల్లుడు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి టీడీపీలో సీటు దక్కలేదు. ఒక వేళ సీటు ఇచ్చినా ఆయ‌న ఓడిపోయి ఉండేవారు. ఈ ఎన్నికల్లో వైసీపీలోనే ఉండి ఉంటే నెహ్రూకు ఖ‌చ్చితంగా ఆయనకు మంత్రి పదవి లభించేది. ఇక రంపచోడవరం నుంచి వైసీపీ తరపున గెలుపొందిన వంతల రాజేశ్వరి కూడా ఈసారి టిడిపి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 


ఇక జనసేన ఏడాది క్రితం గోదావరి జిల్లాలో  ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తుందని నమ్మి కొందరు కీలక నేతలు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఎన్నికల్లో వారంతా చిత్తుగా ఓడిపోయారు. రాజమహేంద్రవరం రూరల్ నుంచి జనసేన తరపున పోటీ చేసిన కందుల దుర్గేష్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. దుర్గేష్ వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లారు. అప్పటికే ఆయనకు వైసిపి రూరల్ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అయితే ఆయన మాత్రం పవన్ పై ఉన్న నమ్మకంతో జనసేనలో చేరి పోటీ చేసిన ఓడిపోయారు. కందుల దుర్గేష్ పార్టీ మారటం వల్ల ఆయనకు కలిగిన లాభం లేకపోయినా అక్కడ వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు ఓడిపోవాల్సి వచ్చింది. 


ఇక జనసేన తరపున మండపేటలో పోటీచేసిన వేళ్ళ లీలా కృష్ణ, ముమ్మిడివరం అభ్యర్థి పితాని బాలకృష్ణ, అమలాపురంలో పోటీచేసిన శెట్టిబ‌త్తుల‌ రాజబాబు కూడా వైసిపిలో కీలకంగా ఉండేవారు. వీరికి జగన్ నుంచి సీటుపై హామీ లేకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి జ‌న‌సేన‌లో చేరారు. వీళ్లంతా టీడీపీ, వైసీపీకి ధీటైన పోటీ ఇస్తామ‌న్న బ్ర‌మ‌లో ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఇక అదృష్టం ఏంటంటే 2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన జ్యోతుల‌ చంటిబాబు 2019లో టీడీపీ సీటు రాద‌ని భావించి వైసీపీలో చేరిపోయారు. ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి నెహ్రూ పై సంచలన విజయం సాధించారు. ఏదేమైనా పార్టీ మారిన వారి జీవితం పూర్తిగా త‌ల్ల‌కిందులు అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: