రాప్తాడులో ప‌రిటాల వార‌సుడు చెమ‌టోడుస్తున్నాడుగా.... తోపుదుర్తి ట‌ఫ్‌ఫైట్‌...!

VUYYURU SUBHASH
అనంతపురం రాప్తాడు నియోజకవర్గం...ఈ పేరు వినగానే ముందు గుర్తుచ్చేది దివంగత పరిటాల రవీంద్ర కుటుంబం...రవీంద్ర మరణం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన సతీమణి పరిటాల సునీత....రాప్తాడు నుంచి టీడీపీ అభ్యర్ధిగా 2009, 2014 ఎన్నికల్లో ప్రత్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై గెలుపొందారు. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ తరపున మొదటిసారిగా పరిటాల కుటుంబం నుంచి వారసుడైనా పరిటాల శ్రీరామ్‌ అసెంబ్లీ బరిలోకి దిగడంతో రాప్తాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఓటమి ఎరుగని పరిటాల కుటుంబం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో ముందుకు వెళుతున్నారు.


ఇక టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు ఉన్న ప్రధాన బలం పరిటాల అనే బ్రాండ్‌ ఇమేజ్‌.. అలాగే గత ఐదేళ్ల పాలనలో మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు. అదేవిధంగా నియోజకవర్గంలో 36 చెరువులను కృష్ణా జలాలతో నింపి గ్రామాలను సస్యశ్యామలం చేయడం లాంటి అంశాలు శ్రీరామ్‌కి కలిసొస్తాయి. కానీ నియోజకవర్గంలో కుటుంబపాలన సాగుతోందని ఆరోపణ రావడం...అలాగే సీనియర్‌ నాయకులకు న్యాయం జరగలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. శ్రీరామ్ దూకుడు రాజ‌కీయాల‌తో కొంద‌రు ఇబ్బంది ప‌డిన వార్త‌లు కూడా వ‌చ్చాయి. అలాగే ప‌రిటాల అనుచ‌గ‌ర‌ణం చేసిన దందాలు కూడా ఆ పార్టీకి మైన‌స్‌. ఇవి శ్రీరామ్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.


మరోవైపు రెండు సార్లు ఓటమి చెంది ముచ్చటగా మూడోసారి రాప్తాడులో బరిలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లుతున్నారు. తోపుదుర్తికి వరుసగా రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి ఉంది. పైగా ఇక్కడ సొంత సామాజిక వర్గం అధికంగా ఉండటం..నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌లో ఐకమత్యం రావడం లాంటి అంశాలు కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా ప్లస్ అవ్వొచ్చు. అయితే తోపుదుర్తి నియోజకవర్గంలో బీసీ వర్గాలను ఆకట్టుకోవాల్సి ఉంది. రాప్తాడు నియోజకవర్గంలో బీసీ ఓటర్లే గెలుపొటములని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ఓటర్లలో బీసీలు 50శాతంపైగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ టీడీపీకి బీసీలే అండగా నిలుస్తున్నా... ఈ సారి ప‌రిస్థితి మార్పు వ‌చ్చిన‌ట్టు క‌న‌ప‌డుతోంది.  ఏదేమైనా ప‌రిటాల వార‌సుడి గెలుపు సులువు కాద‌ని రాప్తాడు రిపోర్ట్ చెపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: