బీజేపీలోకి జయప్రద...! కండువా మారిస్తే కలిసొస్తుందా..?

Vasishta

జయప్రద.. పేరు తెలియని వారుండరు.. సినీరంగంలో ఓ వెలుగు వెలిగన జయప్రద ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. తెలుగింటి ఆడబిడ్డగా మొదలుపెట్టిన ప్రస్థానం జాతీయస్థాయిలోనూ చాటగలిగింది. తెలుగుదేశంతో ప్రారంభమైన ఆమె మనుగడ.. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది...


సుపరిచత నటి జయప్రద పార్టీ మారబోతున్నారు. సమాజ్ వాదీ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆమె కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆమె బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఆమె లోక్ సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నట్టు తెలుస్తోంది. 2004 నుంచి 2014 వరకూ ఆమె ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాంపూర్ నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున అజంఖాన్ పోటీ చేయబోతున్నారు. సమాజ్ వాదీ పార్టీలో విభేదాలు తలెత్తినప్పుడు అజంఖాన్ పై జయప్రద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడిని చూస్తుంటే అల్లాఉద్దీన్ ఖిల్జీ గుర్తొస్తున్నారని కామెంట్ చేశారు.


ఉత్తరప్రదేశ్ లో గత ఎన్నికల్లో 72 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి ఎదురీదుతోంది. ఎస్పీ- బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం, కొన్ని చోట్ల ఆ కూటమికి మద్దతుగా కాంగ్రెస్ నిలవడంతో బీజేపీకి చావుదెబ్బ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీల్లోని అసంతృప్తులకు గాలం వేస్తోంది. కొంతకాలంగా సమాజ్ వాదీ పార్టీకి దూరంగా ఉన్న జయప్రదను కూడా ఇలాగే లాగుతోంది బీజేపీ. ఈరోజు సాయంత్రం ఆమె అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనుంది. మరి ఆమె ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: