ప‌వ‌న్ పాలిటిక్స్ కాపీ కొట్టేస్తున్నాడు...

VUYYURU SUBHASH
రాజ‌కీయాల‌లో కొత్త ఒర‌వ‌డిని సృష్టిస్తాన‌ని చెప్పిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇత‌ర పార్టీల‌లోని వాళ్ల‌ని చేర్చుకునేది లేద‌ని ఖ‌రాఖండీగా చెప్పు కొచ్చారు. అదేవిధంగా కుటుంబ రాజ‌కీయాల‌కు కూడా తాను వ్య‌తిరేక‌మ‌న్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీ పెట్టి నాలుగున్న‌రేళ్లు దాటిపోయినా ఇత‌ర పార్టీల‌లోని వారిని ఎవ‌రినీ ఆయ‌న త‌న పార్టీలోకి పిల‌వ‌లేదు. పిలిచి ఉంటేదాదాపు ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జ‌న‌సైనికులు, నాయ‌కులు బాగానే ఉండేవార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. కానీ, ప‌వ‌న్ ఎవ‌రినీ నిన్న మొన్న‌టి వ‌ర‌కు చేర్చుకోలేదు. అంతేకాదు, త‌న పార్టీలో యువ ర‌క్తం నిండాల‌ని భావించి.. పెద్ద ఎత్తున వివిధ జిల్లాల్లో యువ‌త‌కు పెద్ద పీట వేశారు. 


రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారికి ఆహ్వానం ప‌లికారు. డిబేట్లు, వ్యాస‌ర‌చ‌న వంటి వాటిలో నిష్ణాతుల‌ను త‌యారు చేయాల‌ని భావించి భారీగా జిల్లాల్లో జ‌న‌సేన రిక్రూట్ మెంట్ల‌కు తెర‌లెత్తారు. ఈ క్ర‌మంలోనే వివిధ జిల్లాల్లోని యువ‌త కూడా ఆయా వేదిక‌ల్లో పాల్గొని వివిధ‌ ప‌రీక్ష‌లు కూడా రాసింది. అయితే, ఇది కొన్నాళ్ల త‌ర్వాత ఎందుకో మూల‌న‌ప‌డింది. ఎక్క‌డా కూడా భారీస్తాయిలో రిక్రూట్‌మెంట్లు జ‌ర‌గ‌లేదు. ఇక‌, ఇప్పుడు  ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్‌ త‌న పంథాను మార్చుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అది కూడా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు బాట‌లోనే ప‌వ‌న్ ప‌య‌నిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 


వివిధ‌ పార్టీల్లోని నేత‌ల‌ను ఇప్పుడు ప‌వ‌న్ చేర్చుకుంటున్నారు. వారి ఇళ్ల‌కు వెళ్లి క‌లుస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపిస్తార‌ని అనుకుంటే వారిని ప‌వ‌న్ వ‌దిలి పెట్ట‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌వ‌న్ విజ‌న్ మారిన నేప‌థ్యంలోనే ఈ మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఖ‌చ్చితంగా ఏడాది కింద‌.. త‌న‌కు ప‌ద‌వితో సంబంధం లేద‌ని త‌న‌కు అనుభ‌వం కూడా లేద‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఏకంగా ఇప్పుడు సీఎం సీటుపైనే క‌న్నేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పైకి అవ‌కాశం ఇస్తే సీఎం అవుతాన‌ని అంటున్నా.. ఆయ‌న మ‌న‌సులో మాత్రం సీఎం కావాలనే ఉత్సాహం తొంగి చూస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. 


ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కాలంలో నేత‌ల‌ను చేర్చుకోవ‌డం ప్రారంభించారు. తాజాగా వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ను ప‌వ‌న్ జ‌న‌సేన‌లోకి చేర్చుకున్నారు. ఆయనతోపాటు తూర్పు గోదావరి జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావు (నానాజీ)ని కూడా జనసేన అధినేత‌ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసేవారికి అండగా ఉంటామని ప‌వ‌న్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. తాను స్వల్ప కాలిక ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని మ‌ళ్లీ పాత పాట‌నే పాడారు. జనసేన అనేది నా పార్టీ అని ఎప్పుడూ అనుకోనని.. మనది.. మనం అనే భావనలే ఉంటాయని పేర్కొన్నారు. మొత్తానికి ప‌వ‌న్ కూడా బాబు బాట‌నే ఎంచుకున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, రాబోయే ఎన్నిక‌ల స‌మ‌యానికి ప‌వ‌న్ ఇంకెలాంటి యూట‌ర్న్ తీసుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: