ప్రణబ్ వ్యూహమేమిటి? భారత రాజకీయాల్లో మరోచరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారా?

ప్రణబ్ ముఖర్జీ వ్యూహమేమిటి? మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారా?  82 యేళ్ళ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ లోని రాజకీయ సామర్ధ్యం నివురు చేత కప్ప బడింది. రాష్ట్రపతి పదవీ విరమణతో ఆ నివురు కాస్తా గాలికి ఎగిరిపోయి అందులోని ఆయనకు కాంగ్రెస్ తీర్చని ఆకాంక్షల అగ్నికణం రగుల్తూనే బయటపడింది.ఎనిమిది దశాబ్ధాల వయసు దాటి ఆరు దశాబ్ధాలకుపైగా అనుభవం సత్తా ఇప్పుడేమిటో చూపిస్తారా?  తన జీవితం మొత్తాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని తన ఆకాంక్షలకు పంగ నామం పెట్టిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలనుకుంటున్నారా?  జనంలో ఈసందేహం కలగటానికి కారణం వచ్చేనెలలో జరిగే ఆర్ ఎస్ ఎస్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ప్రణబ్‌ ముఖర్జీ అంగీకరించడం. 

దీన్నిబట్టి ఆయన దృష్టి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై పడిందా? తమ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ అధినేత మోహన్‌ భగవత్‌ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్‌ అంగీకరించడం రాజకీయవర్గాల్లో పెను సంచలనాన్నే కాదు, విశ్లేషకుల్లో గొప్ప ఆసక్తినే రేకెత్తించింది. కాంగ్రెస్‌ పార్టీలో సుమారు 50ఏళ్లు పని చేసినా, ప్రధాని పదవి దక్క లేదని ప్రణబ్‌ బహిరంగంగానే పలు సందర్బాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ వాదిగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ, 'రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్ - ఆర్ ఎస్ ఎస్' జాతి వ్యతిరేక, దుష్ట సంస్థ అని ధారుణంగా విమర్శిస్తూ బహిరంగ వైరమే పేదర్శించిన ప్రణబ్ దాదా ఇప్పుడు అదే సంస్థ "స్వయం సేవకుల శిక్షణ" ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండటం దేనికి సంకేతమనేది అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. ఆర్ ఎస్ ఎస్ –బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్న సమయంలో ప్రణబ్‌ నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కాదు ఈ నిర్ణయంతో ఈ దేశ మాజీ ప్రథమ పౌరుడు, తల నెఱిసిన రాజకీయ నాయకుడు ఈ భారత సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటని తెలుసు కోవటానికి జనం నిరీక్షిస్తున్నారు. కారణం దేశం రాజకీయంగా క్రాస్-రోడ్స్ వద్ద నిలబడిన తరుణం ఇది. 

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 'ఆర్ ఎస్ ఎస్-అంటరాని సంస్థ కాదనే సందేశం" ఎందుకు ఇవ్వబోతున్నారనేది ఇప్పటికైతే ఇంకా సమాధానం రావలసిన ప్రశ్నే. ప్రణబ్‌ దాదాకు ఉన్న హోదా రీత్యా ఆయన్ని ప్రస్తుతానికి ఎవరూ వేలెత్తి చూపలేదు. చూపకూడదు కూడా!  ఏదేమైనా ప్రణబ్ ఈ నిర్ణయం కాంగ్రెస్ కు శరాఘాతమే కాదు మృత్యుభయమే కూడా!  స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆయన నిర్ణయంపై ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

కేంద్రంలో, సుమారు 20 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నడిపిస్తున్న ఆర్ ఎస్ ఎస్ తో చర్చలు జరపడానికే ప్రణబ్‌ ముఖర్జీ ఈ ఆహ్వానానికి అంగీకరించి ఉంటారని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల నుంచి వైదొలగలేదని నాగ్‌పూర్‌ నుంచి ఏమైనా సందేశం పంపినట్లయితే ఆయనపై ఉన్న గౌరవం పోతుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీమంత్రి వ్యాఖ్యానించారు. వీళ్ళ ఆలోచనలు ఇలా ఉంటే, కేంద్ర మాజీ మంత్రి కాకలు తీరిన రాజనీతిజ్ఞుడు వ్యూహచతురుడు  చిదంబరం  ప్రణబ్‌ దాదా  ఆర్ ఎస్ ఎస్ సమావేశానికి ముఖ్య అథిదిగా వెళ్ళడానికి అంగీకరించటంపై  పి.చిదంబరం ఆయనకు బహిరంగంగా మద్దతుగా నిలిచారు.

ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమానికి హాజరై ఆ సంస్థ సిద్ధాంతాల్లోని భావజాలాల్లోని తప్పులేంటో? వారికి తెలిజెప్పాలని ప్రణబ్‌ కు విజ్ఞప్తి చేశారు. అలా చేయటంలోనే ఒక చిదంబర రహస్యం దాగుందనిపిస్తుంది కూడా! ఆర్ ఎస్ ఎస్ ఆహ్వానాన్ని ప్రణబ్‌ ముఖర్జీ ఎందుకు అంగీకరించారన్న దానిపై ఇప్పుడు చర్చించడం వృథా అని అభిప్రాయపడ్డారు.


రాష్ట్రపతి పదవి నుంచి విరమణ చేసినప్పటికీ తానింకా క్రియాశీల రాజకీయాలకు దూరం కాలేదని ప్రణబ్‌ ముఖర్జీ దీని ద్వారా సందేశం ఇచ్చారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలకనేతగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ ట్విటర్‌లో తనను తాను "సిటిజన్‌ ముఖర్జీ" గా ప్రస్తావించుకుంటారు. తద్వారా తాను "స్వతంత్ర పౌరుడి" ననే సందేశాన్ని ఇస్తారు. ఈ సంకేతాలకు అనుగుణంగానే ఆయన తాజా చర్యలు ఉంటున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: