తూర్పు` వైసీపీని ముంచేస్తున్న విభేదాలు!!

VUYYURU SUBHASH
రెండేళ్ల ముందుగానే పార్టీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల హామీలు ప్ర‌క‌టించినా.. ఇంకా జిల్లాల్లోని నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం  లేదు! న‌వ‌రత్నాల్లాంటి ప‌థ‌కాల‌ని నేత‌లు చెబుతున్నా.. ఇంకా అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు మాత్రం కొన‌సాగుతూనే ఉన్నాయి! ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల్లో బ‌ల‌ప‌డాల‌ని జ‌గ‌న్ ఎంత‌లా నిశ్చయించుకున్నారో.. అంత‌కు మించి ఆయ‌న ఆశ‌లు అడియాశ‌ల‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. 
తూర్పుగోదావ‌రి జిల్లాల్లో నేత‌ల మ‌ధ్య వర్గ పోరు తార‌స్థాయికి చేరింది. గ్రూపు రాజ‌కీయాల‌తో నేత‌లు సొంత వ‌ర్గాల‌ను పెంచుకునే ప‌నిలో ప‌డ్డారు. వీలైనంత త్వ‌ర‌గా వీటిని ప‌రిష్క‌రించ‌లేని ప‌క్షంలో జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పులు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు! 


తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి . ఈ స్థానాల్లో కొత్తపేట, తుని, రామచంద్రపురం, రంపచోడవరం, రాజానగరం, అనపర్తి, కాకినాడ రూరల్, కాకినాడ, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, మండపేట నియోజకవర్గాల్లో కోల్డ్ వార్ మామూలుగానే ఉంది. 


కీల‌క‌మైన రాజమండ్రి , రాజమండ్రి రురల్ , అమలాపురం , గన్నవరం, ముమ్మిడివరం ,నియోజకవర్గాల్లో గ్రూపుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు తీవ్రంగా ఉంది. అయితే ఇదే స‌మ‌యంలో పార్టీ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడిగా వ‌చ్చిన ప్ర‌శాంత్ కిషోర్ నిర్ణ‌యాల‌తో ఆశావ‌హుల్లో కొత్త ఆశ‌లు చిగురిస్తున్నాయి. గ్రూపుల వారీగా త‌మ బ‌లాన్ని నిరూపించుకునేందుకు ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నిస్తున్నారు. 


రాజమండ్రి వైసీపీలో ప్రస్తుతం రెండు గ్రూప్ లు నడుస్తున్నాయి. ఒకటి కో-ఆర్డినేటర్ రౌతు సూర్య ప్రకాశం రావుది కాగా, మరొక‌టి గ్రూప్ కౌన్సిల్ విపక్ష నేత షర్మిలా రెడ్డి గ్రూప్. ఇది కాక మాజీ మంత్రి జ‌క్కంపూడి సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ఆమె కుమారులు నడిపించే గ్రూప్. రాజమండ్రి రూరల్ లో గత ఎన్నికల్లో ఓడిన ఆకుల వీర్రాజు వర్గం ఒకటి కాగా, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామి నాయుడు అన్న కుమారుడు గిరజాల బాబు మరో గ్రూప్ గాను , గ్రేటర్ రాజమండ్రి అధ్యక్షులు కందుల దుర్గేష్ వర్గం ఉన్నాయి.  రాజానగరంలో జక్కంపూడి వర్గానికి గ్రూపులు లేక‌పోయినా  చాలా కార్యక్రమాలు ఎవరికి వారే విడిగా ప్లాన్ చేసుకుంటున్నారట‌.


అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే విష‌యంలో ప్ర‌శాంత్ కిషోర్ నిర్ణ‌యాన్ని కూడా జ‌గ‌న్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అవ‌కాశాలు ఉండ‌టంతో.. ఇప్ప‌టినుంచే ఆశావ‌హులు యాక్టివ్ అయిపోతున్నారు. టికెట్ కేటాయింపుల్లో చివ‌రి నిమిషంలో టికెట్ తన్నుకు పోవొచ్చని వీరు సంబ‌ర‌ప‌డుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే అంశం.. నియోజ‌క‌వ‌ర్గ కో ఆర్డినేట‌ర్ల‌ను టెన్ష‌న్ పెడుతోంది. ఎప్పటికప్పుడు సర్వేలు అభ్యర్థుల బలం బలహీనతలు లెక్కలు అధిష్టానానికి వెళుతూ ఉండటం తో ఎవరి జాగ్రత్తలో వారు ఉన్నారు .ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ గ్రూపులు పార్టీని ముంచుతాయో లేక పైకి తీసుకొస్తాయో వేచిచూడాల్సిందే!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: