జల్లికట్టు... తమిళుల ఉడుంపట్టు

Prasad Bura
సంప్రదాయ క్రీడగా జల్లికట్టుకు అధికారిక గుర్తింపు కోసం యావత్ తమిళ రాష్ట్రం మొత్తం పోరాడుతోంది. జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం రాత్రి నుండి తమిళ ప్రజలు ఆందోళనను కొనసాగిస్తున్నారు. జట్టికట్టు పై నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడంతో పాటు.. పెటా సంస్థను రద్దు చేయాలని చెన్నై మెరీనా బీచ్ లో నిరసన ప్రదర్శనలు కొసాగిస్తున్నారు. ఆందోళనకారులు, జల్లికట్టు మద్దతు దారులతో బీచ్ జన సంద్రంగా మారింది. 

జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీచేయండి.. ప్రధానికి పన్నీర్ సెల్వం విజ్ఞప్తి
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతుండటంతో.. సీఎం పన్నీరు సెల్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన ఆయన ఏఐడిఎంకే ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు తొలగించేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని మోదీని కోరారు. త్వరగా నిర్ణయం తీసుకోకుంటే తమిళనాడులో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందంటూ వినతి పత్రాన్ని సమర్పించారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను కూడా ప్రధానికి వివరించినట్లు పన్నీరు సెల్వం చెప్పారు. 

పన్నీరు సెల్వం విజ్ఞప్తిపై పీఎంవో ప్రకటన
ప్రధాని మోదీ, పన్నీరు సెల్వం భేటీ వివరాలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. జల్లికట్టు పైనే ప్రధానంగా చర్చ జరిగిందన్న పీఎంవో.. తమిళ సంస్కృతిలో భాగమని, సంప్రదాయ నేపథ్యాన్ని తాము గౌరవిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున.. ముందడగు వేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదముందని అభిప్రాయపడింది. అలాగే కరవు నివారణకు తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని ప్రధానీ మోదీ హామీ ఇచ్చినట్లు తెలిపింది. త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు ప్రకటించింది. 

త‌మిళ‌నాడులో షూటింగ్‌లు రద్దు
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. అన్ని ప్రాంతాల నుంచి చెన్నైలోని మెరీనా బీచ్‌కు ప్రజలు తరలివస్తున్నారు. శాంతియుత పద్ధతిలో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరికి మద్దతుగా పలువురు సినీనటులు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. జల్లికట్టుకు మద్దతుగా దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంస్థ గురువారం షూటింగులు రద్దు చేసుకుంది. సినిమా, టీవి రంగాలకు చెందిన వారంతా విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. 

ఇది తమిళుల విప్ల‌వం-  విశాల్
జల్లికట్టుపై ఆందోళనకు తమిళ సినీ లోకం మద్దతు ప్రకటించింది. విద్యార్ధుల పోరాటానికి తాను కూడా మద్దతు తెలుపుతున్నట్లు హీరో విశాల్ ప్రకటించాడు. ఈ సమస్య పరిష్కారానికి ప్రధాని మోదీ చొరవ చూపాలని కోరాడు. కేంద్రం తక్షణమే ఆర్డినెన్స్ తీసుకువచ్చి, తమిళుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశాడు. జ‌ల్లిక‌ట్టుపై ప్ర‌జ‌లు చేస్తోంది నిరసన కాదని, ఇదో విప్ల‌వమ‌న్నాడు విశాల్.

ప్రజలంతా ఏకమైతే ఏదైనా సాధ్యమే - అరవింద్ స్వామి
జల్లికట్టుకు అధికారిత కోసం ప్రజలు శాంతియుత మార్గంలో నిరసన చేపట్టడం గర్వంగా ఉందని అరవింద్ స్వామి తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. మహా సంకల్పంతో ప్రజలంతా ఏకమైతే.. సాధ్యం కానిది ఏదీ లేదని గుర్తు చేశాడు. ప్రజా పోరాటానికి తాను ఎప్పుడూ మద్దతిస్తానని ప్రకటించాడు. 

మెరీనాబీచ్‌ నుంచి వీడియో పోస్ట్ చేసిన ప్రభుదేవా!
మెరీనా బీచ్ వ‌ద్ద‌ ఆందోళన చేస్తున్న వారికి డ్యాన్స్ మాష్టర్ ప్రభుదేవా మద్దతు తెలిపాడు. మెరీనా బీచ్ వద్ద పరిస్థితిని వీడియో తీసి, తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు.  వేల సంఖ్యలో జనం బీచ్‌ వద్దకు చేరి ఆందోళనలో పాల్గొంటున్నార‌ని చెప్పాడు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయమని కోరుతూ తన ప్రొఫైల్ పిక్ ని కూడా ప్రభుదేవా మార్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: