విదేశీ ప్రయాణికులను వీడని కష్టాలు!

N.Hari
వివిధ దేశాల్లో కరోనా ఆంక్షలు, నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుండటం, అవి కొనసాగుతూ ఉండటంతో విదేశీ ప్రయాణికులను కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి దాపురించిన తర్వాత వివిధ దేశాలకు ప్రయాణించడం సవాలుగా మారిందనే చెప్పాలి. ప్రయాణంలో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రయాణం చేస్తున్న వారికి సమస్యలు మరింత ఎక్కువే ఎదురవుతున్నాయి. ఇటీవల కొందరు యూఏఈలో కరోనా ఆంక్షలు సడలించారని తెలిసి.. దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. తీరా ఎయిర్‌పోర్టుకు చేరిన తర్వాత.. ఆ ఎయిర్ లైన్స్  నుంచి వెళ్లే వారికి వీసా ఆన్ అరైవల్ ఫెసిలిటి లేదని తెలిసింది. దీంతో టిక్కెట్లు క్యాన్సిల్‌ చేసుకుని ఎమిరేట్స్ టిక్కెట్ కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి ఘటనలు రోజూ చాలా మందికి ఎదురవుతున్నాయి.
ఇక ఖతార్ వెళ్లేందుకు మరికొంత మంది ప్రయాణికులు విమానం బయలుదేరడానికి మూడు గంటలు ముందుగానే విమానాశ్రయం చేరుకోగా.. అక్కడి సిబ్బంది షాక్ ఇచ్చారు. కొవిడ్ పరీక్షల కోసం విమానం బయలుదేరడానికి ఐదారు గంటలు ముందే రావాలని సెలవిచ్చారు. అయితే సమయం మార్చిన విషయం తెలియకపోవడంతో ఆ ప్రయాణికులు టిక్కెట్లు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మారుతున్న నిబంధనలను ప్రయాణికులు తెలుసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.  ఇలా కరోనా పరీక్ష ప్రమాణాలతో పాటు ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్టు నిబంధనలు తెలియక పలువురు ప్రయాణికులు సతమతం అవుతున్నారు.
అంతర్జాతీయ ప్రయాణికులు రెండుసార్లు కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం అన్ని విమానయాన సంస్థలు.. గమ్యస్థానం చేరుకునే సమయానికి 48 గంటల ముందుగా కొవిడ్‌ పరీక్ష రిపోర్టుతో రావాలని చెబుతున్నాయి. గతంలో ఇది 48 నుంచి 72 గంటలుగా ఉండేది. అయితే ఈ సమాచారం  విమానయాన సంస్థల వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ కావడం లేదు. ఈ విధంగా నిబంధనలు తరుచూ మారుతున్నాయి. వివిధ దేశాలు కరోనా ఆంక్షలను కఠినం చేస్తున్నాయి. దీంతో  ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులు అన్నింటిని దృష్టిలో ఉంచుకుని విదేశీ ప్రయాణికులు బయలు దేరడానికి కనీసం ఒక రోజు ముందే విమానయాన సంస్థ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి వాకబు చేయడం మంచిదని ఆయా విమానయాన సంస్థల అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: