అమెరికన్ రాజకీయ నాయకుడికి సవాల్ విసిరిన భారత ఇంజనీర్?

Suma Kallamadi
భారత సంతతికి చెందిన అమెరికన్ ఇంజనీర్, వ్యాపారవేత్త శ్రీనా కురానీ(28) రిపబ్లికన్ పార్టీ రాజకీయ నాయకుడికి సవాల్ విసిరారు. శ్రీనా డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రతినిధుల సభ కు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్‌లో భారతీయ దంపతులకు శ్రీనా కురానీ జన్మించారు. ఈమె నవంబర్, 2022‌లో జరిగే మధ్యకాల ఎన్నికలలో ప్రత్యర్థి కెన్ కాల్వెర్ట్‌ని కుర్చీ దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కెన్ కాల్వెర్ట్‌ సమస్యలను పరిష్కరించ లేరని కానీ తాను ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలనని ఆమె చెప్తున్నారు. కెన్ కాల్వెర్ట్‌ స్వప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నికయ్యారని ఆమె అన్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా వేరొక రాజకీయ నాయకుడికి పగ్గాలు అప్పజెప్పే సమయం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.


శ్రీనా కురానీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కెన్ కాల్వెర్ట్ 15 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా పని చేశారు. ఆమె కాంగ్రెస్ జిల్లా రివర్‌సైడ్‌లో డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తుండగా.. జిల్లాలో రిపబ్లికన్ పార్టీకే ఎక్కువగా బలం ఉందని తెలుస్తోంది. దీంతో ఆమెకు ప్రత్యర్థి పార్టీ నుంచి బలమైన పోటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.


శ్రీనా కురానీ మీడియాతో మాట్లాడుతూ.. "వాషింగ్టన్ లో పనులు చకచకా జరిగిపోవడానికి.. ప్రజలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తాను. నేను చాలా వ్యాపారాలను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశాను. చెత్త శుభ్రం చేయడం, జాబులు సృష్టించడం వంటివి ఎన్నో చేశాను." అని చెప్పుకొచ్చారు.


లా సియెర్రా హైస్కూల్ లో 16 సంవత్సరాలకే తన పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా పొందారు. అమెరికన్ ప్రజలకు విద్య, వైద్యం చౌక ధరలకే అందేలా పలు చిన్న, పెద్ద వ్యాపారాలు సంస్థలు కృషి చేస్తుండగా.. ఆమె వాటికి సలహాదారుగా పనిచేశారు. సమర్థవంతమైన విద్య, వైద్యం ప్రజలందరికీ ఒకేలా అందించడమే తన లక్ష్యంగా ఆమె చెబుతున్నారు. ఇంజనీర్ అయినప్పటికీ ఆమె బిజినెస్ రంగంలో కూడా కాలుమోపి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పుడు ఏకంగా రాజకీయ రంగంలో అడుగు పెట్టి ప్రజల సమస్యలను తీర్చేందుకు రెడీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: