భారతదేశ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌పై కన్నేసిన కెనడియన్ సంస్థ..?

Suma Kallamadi
కెనడియన్ శాటిలైట్ మేజర్ "టెలిసాట్" ఇండియన్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే శాటిలైట్ ప్లేయర్స్ విధానంపై స్పష్టత పొందడానికి టెలికాం డిపార్ట్మెంట్ తో సుదీర్ఘమైన చర్చలు జరిపింది. దిగువ భూకక్ష్యలో ఉన్న శాటిలైట్స్ సమూహాన్ని ఉపయోగించి ఇండియాకి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి "సాట్కామ్(Satcom)" ప్లేయర్స్ సంస్థ ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థ హోస్ట్‌లో టెలిసాట్ చేరి ఇండియా బ్రాడ్ బ్రాండ్ మార్కెట్ లో ప్రవేశించనుంది.
భారతదేశంలో ఇంటర్నెట్ అందించడానికి చాలా అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపాయి. వాటిలో ఎలోన్ మస్క్ స్టార్‌లింక్‌, జెఫ్ బెజోస్ ప్రాజెక్ట్ కైపర్, సునీల్ భారతి మిట్టల్ వన్ వెబ్ మేజర్స్ ఉన్నాయి. ప్రస్తుతం కేబుల్స్, టవర్స్ ద్వారా మన భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను ఆస్వాదిస్తున్నాం. కానీ అంతర్జాతీయ శాటిలైట్ మేజర్స్ భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు అందించడం ప్రారంభిస్తే.. ప్రజలందరూ కూడా శాటిలైట్ ద్వారానే ఇంటర్నెట్ పొందొచ్చు. అయితే దేశం మొత్తంలో ప్రతి మూల కూడా ఇంటర్నెట్ అందించే దిశగా శాటిలైట్ ప్లేయర్స్.. భూమి దిగువ కక్ష్యలోకి చిన్న స్థాయి శాటిలైట్స్ ను భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాయి.
ఇటీవల ఇండియన్ టెలికాం డిపార్ట్మెంట్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ గురించి చర్చించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశంలో గ్లోబల్ శాటిలైట్ ఆపరేటర్లు అయిన టెలిసాట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఒక పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. టెలిసాట్‌ స్పెక్ట్రమ్, మార్కెట్ యాక్సెస్ డైరెక్టర్ అయిన లారా రాబర్టీ టెలికాం డిపార్ట్మెంట్ సమావేశానికి హాజరయ్యారని సమాచారం.
భూమి నుండి 500-2,000 కిలోమీటర్ల దూరం కక్ష్యలో ఉన్న 'లోఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్' వేగంగా సమాచారాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. భూమి యొక్క దిగువ కక్ష్యలలో ఉన్న శాటిలైట్స్ కారణంగా లేటెన్సీ అనగా డేటా ట్రాన్స్‌ఫర్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల డేటా ట్రాన్స్‌ఫర్ మిల్లీ సెకన్ల సమయంలోనే జరిగిపోతుంది. మన దేశంలో ప్రస్తుతం 20-100 మిల్లీ సెకన్ల లేటెన్సీ అందుబాటులో ఉంది. మరి శాటిలైట్స్ సహాయంతో అంతకంటే తక్కువ సమయంలో ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయో లేదో చూడాలి. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న జియోసింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ కంటే లోఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ను(నిర్ణీత సమయంలో ఒక వినియోగదారుడికి ట్రాన్స్‌ఫర్ చేసే డేటా) అందిస్తాయి. 2020 మెకిన్సే రిపోర్టు ప్రకారం.. కేబుల్, కాపర్ & ప్రీ -5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ కంటే లోఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ వేగవంతమైన ఇంటర్నెట్ ని అందిస్తాయట.
ఒట్టావా ఆధారిత టెలిసాట్ ప్రపంచంలోనే అతిపెద్ద శాటిలైట్ ఆపరేటర్లలో ఒకటి కాగా.. ఇది కెనడాకు శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించాలనే ఉద్దేశంతో 50 సంవత్సరాల క్రితమే ఆవిర్భవించింది. ఈ సంస్థ దిగువ భూమి కక్ష్య నెట్‌వర్క్ అయిన టెలిసాట్ లైట్‌స్పీడ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ నెట్‌వర్క్ 298 శాటిలైట్స్ తో గ్లోబల్ నెట్‌వర్క్ గా అవతారం ఎత్తుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: