జెఫ్‌ బెజోస్‌ రాకెట్‌ రూపశిల్పుల్లో ఇండియన్ యువతి..?

Suma Kallamadi
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ కి అంతరిక్ష సంస్థ అయిన ‘బ్లూ ఆరిజిన్‌’ ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రముఖ అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’లో మహారాష్ట్రలోని కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల  ఇంజనీర్ సంజల్‌ గవాండే పనిచేస్తున్నారు. అంతేకాదు, ఈ భారతీయ యువతి జులై 20వ తేదీన జెఫ్‌ బెజోస్‌తో పాటు ముగ్గురిని అంతరిక్షంలోకి వెళ్లే ‘న్యూ షెపర్డ్‌’ రాకెట్‌ వ్యవస్థను రూపొందించారు. ఈ రాకెట్‌ను నిర్మించిన ఇంజనీర్ లలో ఆమె ఒకరు కావడం విశేషం. ‘బ్లూ ఆరిజిన్‌’లో సిస్టమ్స్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆమె మెకానికల్ ఇంజనీరింగ్ లో ముంబై యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. 2011వ సంవత్సరంలో అమెరికా కి వెళ్ళిన ఆమె మిషిగన్‌ టెక్నోలాజిక్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తి చేసిన అనంతరం ఆమె మెర్క్యురీ మెరైన్‌లో మొదట డిజైన్ ఎనాలిసిస్ ఇంటర్న్‌గా పని చేశారు. డిజైన్ ఎనాలిసిస్ ఇంజనీర్‌గా 3 సంవత్సరాలు పనిచేసిన తరువాత ఆమె టయోటా రేసింగ్ డెవలప్‌మెంట్‌లో మెకానికల్ డిజైన్ ఇంజనీర్‌గా చేరారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్న ఆమె నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)లో స్పేస్ ఇంజనీరింగ్ ఉద్యోగం కోసం అప్లై చేసారు కానీ సిటిజన్ షిప్ ఇష్యూస్ కారణంగా ఆమె సెలెక్ట్ కాలేదు.
దీంతో ఆమె ఇతరత్రా అంతరిక్షం సంస్థలలో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆమె సియాటెల్‌లోని "బ్లూ ఆరిజిన్‌" అంతరిక్ష సంస్థలో సిస్టమ్స్ ఇంజనీర్‌గా పని చేసేందుకు అర్హత సాధించారు. 2021 ఏప్రిల్ నెల నుంచి ఆమె ఇక్కడే పనిచేస్తున్నారు. అయితే ఆమె ప్రతిభను గుర్తించిన సంస్థ రాకెట్ ను నిర్మించే ఇంజనీర్ల బృందంలో ఒకరిగా ఎంపిక చేసింది.
ఆమె తయారుచేసిన స్పేస్ రాకెట్ త్వరలోనే అంతరిక్షంలోకి ఎగరనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నా చిన్ననాటి కల త్వరలోనే నిజం కాబోతోంది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ‘బ్లూ ఆరిజిన్‌’లో ఒక పార్ట్ అయినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను" అని చెప్పుకొచ్చారు.
సంజల్ గవాండే మహారాష్ట్రకి చెందిన మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి, రిటైర్డ్ ఎంటీఎన్ఎల్ అధికారి అయిన అశోక్ గవాండే కుమార్తె కాగా ఆమె తన మాస్టర్స్ లో ఏరోస్పేస్ ను ఒక సబ్జెక్టుగా ఎంచుకున్నారు. అనంతరం తన సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించారు. ఇదే విషయాన్ని తండ్రి మీడియాకు వెల్లడించారు. తన కూతురికి రాకెట్లు తయారు చేయడం అంటే చాలా ఇష్టం అని ఆయన అన్నారు.
ఇకపోతే 60 అడుగుల ఎత్తు గల న్యూ షెపర్డ్‌ రాకెట్ అంతరిక్షంలో 10 నిమిషాలపాటు విహరించి మళ్లీ అదంతట అదే భూమి మీదకు రానుంది. ఈ రాకెట్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టం తో నడుస్తుంది. దీంతో స్పేస్ షిప్ లోపల డ్రైవర్/పైలెట్ అవసరం లేకుండానే ఈ రాకెట్ రోదసీలోకి అడుగుపెట్టనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: