టాప్ లీడర్‌షిప్ పోస్ట్‌కు నామినేట్ అయిన ఎన్నారై సర్జన్‌..?

Suma Kallamadi
అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా దేశంలోని ఉన్నత పదవుల నియామకాలకు ఎక్కువగా భారతీయుల పేర్లు ప్రతిపాదిస్తున్నారు. అయితే తాజాగా ఆయన యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ఎఐడి) లో సీనియర్ నాయకత్వ స్థానానికి భారత మూలాలున్న సర్జన్, ప్రముఖ రచయిత అతుల్ గవాండేను ప్రతిపాదించారు. యూఎస్ఎఐడి బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ యొక్క అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ కోసం గవాండేను నామినేట్ చేశారని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. కాంప్లికేషన్స్, బెటర్, ది చెక్‌లిస్ట్ మానిఫెస్టో, బీయింగ్ మోర్టల్ వంటి నాలుగు పుస్తకాలను అతుల్ గవాండే రాశారు. అయితే ఈ నాలుగు పుస్తకాలు కూడా న్యూయార్క్ టైమ్స్‌లో అత్యధికంగా అమ్ముడైన బుక్స్ గా చరిత్ర సృష్టించాయి.



"కోవిడ్ తో సహా యూఎస్ఎఐడి వద్ద గ్లోబల్ హెల్త్ డెవలప్మెంట్ కి నాయకత్వం వహించడానికి నామినేట్ అయినందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను. 2020లో కంటే 2021 సంవత్సరం మొదటి భాగంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా మరణాలు సంభవించాయి. ఈ సంక్షోభాన్ని అంతం చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థలను తిరిగి బలోపేతం చేయడానికి సహాయం చేసేందుకు అవకాశం కల్పించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని అతుల్ గవాండే ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.


ఇకపోతే అతుల్ గవాండే మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లోని బ్రిగ్హామ్ & ఉమెన్స్ హాస్పిటల్‌లో జనరల్, ఎండోక్రైన్ సర్జరీ విభాగంలో పనిచేస్తున్నారు. జూన్ 20, 2018న అమెజాన్, బెర్క్‌షైర్ హాత్‌వే, జెపి మోర్గాన్ చేజ్ యాజమాన్యంలోని హెల్త్‌కేర్ వెంచర్ "హెవెన్" యొక్క సీఈవోగా గవాండే ఎంపికయ్యారు. 2007లో అతను శస్త్రచికిత్స మరణాలను తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన ఒక మిషన్ కి డైరెక్టర్ గా నియమితులయ్యారు. 2009లో అతను "హేస్టింగ్స్ సెంటర్" ఫెలోగా ఎన్నికయ్యారు. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన "టైం హండ్రెడ్" థింకర్స్ కేటగిరి లో 5వ వ్యక్తిగా నిలిచారు. 2019లో మోడరన్ హెల్త్‌కేర్ అనే ప్రముఖ హెల్త్‌కేర్ మ్యాగజైన్ పబ్లికేషన్స్ లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో అతను ఒకరిగా నిలిచారు. హెల్త్‌కేర్‌ రంగంలో ఆయన సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నాయి. అతను సైన్స్ గురించి రాసినందుకు 2014 లూయిస్ థామస్ బహుమతి కూడా అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: