అన్ని కోట్లు దానం చేసిన తెలుగు ప్రవాసులు..?

Suma Kallamadi
మాతృభూమిని కాపాడుకునేందుకు ఎన్నారైలు లక్షల, కోట్ల రూపాయలు దానాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో విధాలుగా భారతదేశాన్ని ఆదుకున్న ఎన్నారైలు థర్డ్ వేవ్ సమీపిస్తున్న సమయంలో కూడా మేమున్నామని భరోసా ఇస్తున్నారు. తాజాగా అమెరికాలో నివసిస్తున్న ముగ్గురు తెలుగు వ్యక్తులు అక్షరాల కోటి రూపాయల విలువైన ఆక్సిజన్ పరికరాలను ఇండియాకి విరాళంగా ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన గోపాలకృష్ణ, కర్నూలు జిల్లాకు చెందిన మాధవ్ దేవలార్జా, కడప జిల్లాకు చెందిన నాగరాజు కన్నెబొయిన ఉత్తర ఆంధ్రాలోని జిల్లాలకు ఆక్సిజన్ పరికరాలను విరాళంగా ఇచ్చారు.
కోవిడ్ -19 థర్డ్ వేవ్ విజృంభించనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వానికి సహాయం చేసేందుకు ఎన్నారైలు పూనుకుంటున్నారు. థర్డ్ వేవ్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని బలపరచడానికి ప్రవాసులు తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందులోని భాగంగానే ముగ్గురు తెలుగు ఎన్నారైలు 1,000 డి-టైప్ సిలిండర్లను విరాళంగా ఇచ్చారు. అయితే వాటిలో విశాఖపట్నం కోసం 500.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు 250 చొప్పున సిలిండర్లను అందజేశారు. తాము విరాళంగా ఇచ్చిన సిలిండర్లు పేద ప్రజల ప్రాణాలను కాపాడుతాయని ఎన్నారైలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక 1000 ఆక్సిజన్ సిలిండర్లతోపాటు అనంతపూర్‌లోని సత్యసాయి ట్రస్ట్‌కు 63 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందజేశారు. అలాగే, ఉత్తర తీర జిల్లాలకు 10 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు విరాళంగా ఇచ్చారు.  చైనా యొక్క బీజింగ్‌లోని ఐఎఫ్‌ఎస్ అధికారి దేపక్ పద్మకుమార్.. చైనా నుండి వైజాగ్‌కు రవాణా, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ పరికరాలను దిగుమతి చేసే కార్యకలాపాలను సమన్వయం చేశారు. దీంతో ఆక్సిజన్ పరికరాలన్నీ కూడా చాలా సురక్షితంగా ఇండియాకి చేరుకున్నాయి.
ఇకపోతే భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు భారీ ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకి చెందిన ఎన్నారైలు సైతం కోట్ల రూపాయల విలువైన వైద్య సామాగ్రిని ఉచితంగా అందజేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: