సింగపూర్: భారత మహిళకు 30 ఏళ్లు జైలుశిక్ష..?

Suma Kallamadi
సింగపూర్ లో నివసిస్తున్న గాయత్రి మురుగయన్ అనే 41 ఏళ్ల భారత మహిళకు అక్కడి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. 2015 మే నెలలో గాయత్రి మయన్మార్‌కు చెందిన పియాంగ్ న్గైహ్ డాన్ (24) అనే ఒక యువతిని తన ఇంట్లో పనిమనిషిగా చేర్చుకుంది. అయితే గాయత్రి తన పనిమనిషిని ఆ రోజు నుంచే వేధించడం ప్రారంభించింది. ఏకంగా 14 నెలల పాటు ఈ యువతిని గాయత్రి దారుణంగా హింసించింది. చీపురు కట్ట, లోహపు గరిటెతో పియాంగ్ ని ఆమె చితకబాదిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. గాయత్రి తన పనిమనిషిని జుట్టు పట్టుకొని లాగారని, పిడిగుద్దులు గుద్దుతూ బలంగా తన్నారని కూడా సింగపూర్ పోలీసులు వెల్లడించారు. గాయత్రి తన పనిమనిషికి వాతలు కూడా పెట్టారని తెలిసింది. ఆహారం అందించకుండా పనిమనిషి కడుపు మాడ్చిందని కూడా పోలీసులు వెల్లడించారు.
అయితే 2016, జులై 26వ తేదీన గాయత్రి తన తల్లితో కలిసి పియాంగ్ పై దాడికి దిగింది. ఈ దాడిలో పియాంగ్ గొంతులోని ఒక ఎముక విరిగి పోయింది. అలాగే కోలుకోలేని విధంగా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. దీనంతటికీ కారణమైన గాయత్రి పై వివిధ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. చేసిన నేరానికి గాయత్రి దాదాపు ఐదు సంవత్సరాల పాటు రిమాండ్ లోనే ఉన్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చికిత్స పొందుతూ ఆ పనిమనిషి చనిపోయింది. ఈ విషయం తెలిసిన పోలీసులు గాయత్రిపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఐతే తాజాగా ఆమె కేసు విచారణకి రావడంతో సింగపూర్ కోర్టు నేరాల తీవ్రతను బట్టి ఆమెకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
గాయత్రి అత్యంత దారుణమైన అపరాధ నరహత్యకి పాల్పడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా గాయత్రి తరపున వాదించిన న్యాయవాది తన క్లయింట్ కి శిక్ష తగ్గించాలని.. ఆల్రెడీ తన క్లయింటు రిమాండ్ లో 5 సంవత్సరాలు శిక్ష అనుభవించారని.. 8-9 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించకండి అని కోర్టును కోరారు. తన క్లయింట్ డిప్రెషన్ తో బాధపడుతున్నారని.. ఆమె ఉద్దేశపూర్వకంగా హత్యకు పాల్పడలేదని.. అనారోగ్యంతో బాధపడుతున్న తన పిల్లలను ఆమె కాపాడుకోవాలి అని కోర్టులో న్యాయవాది చెప్పుకొచ్చారు. అయితే పియాంగ్ పై గాయత్రి క్షమించరాని నేరాలకు పాల్పడి హత్యకు కారకురాలయ్యారని.. ఆమె చేసిన నేరాలను పరిగణనలోకి తీసుకుని 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరిస్తున్నామని సింగపూర్ కోర్టు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: