ఆదుర్తి సుబ్బారావు ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన తన సినిమా షూటింగ్ లను చాలా చాకచక్యంతో నిర్వహించేవారు. 1960లో నమ్మినబంటు అనే సినిమాను అక్కినేని, సావిత్రి, ఎస్వీఆర్ వంటి ఆగ్రశ్రేణి నటులతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశాన్ని మద్రాస్ మౌంట్ రోడ్ లో చిత్రీకరించాల్సి వచ్చింది. సినిమా షూటింగ్ అంటే సహజంగా జనం చుట్టుముడతారు కాబట్టి పోలీస్ బందోస్తు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఆదే రోజు ఒక రాజకీయ కార్యక్రమం ఉండటంతో పోలీస్ బందోస్తుకు అధికారులు నిరాకరించారు. దీంతో చిత్ర యూనిట్ కంగారు పడింది. అంత పబ్లిక్ ప్లేస్ లో పోలీసుల సహకారం లేకుండా షూటింగ్ నిర్వహించడం ఎలా అనే అలోచనలో పడింది.
అయితే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ధీమాగా షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. అనుకున్న రోజుకే షూటింగ్ ను నిర్వహించారు. అలాగే రాలేమని చెప్పిన పోలీసులు కూడా షూటింగ్ స్థలానికి వచ్చి జనాన్ని కంట్రోల్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ తేలిగ్గా ఊపిరిపీల్చుకుంది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అభినందిస్తూనే, రామని చెప్పిన పోలీసులు ఎలా వచ్చారు. వారు వస్తారని ముందుగానే మీకు తెలుసా.. అని ఆదుర్తి సుబ్బారావుని ప్రశ్నించారు.
దీనికి ఆదుర్తి తేలిగ్గా నవ్వేస్తూ ‘వారు నిజం పోలీసులు కాదు. నేను ఏర్పాటు చేసిన జూనియర్ ఆర్టిస్టులు’ అని చెప్పారు. అంతా ఒక్కసారికి అవాక్కై తరువాత నిదానంగా తేరుకుని ఆదుర్తి సమయ స్పూర్తిని అభినందించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: