ఈ నెల 10న దర్శకరత్న దాసరి సంతాప సభ..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో  ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్‌ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మహా దర్శకుడు, నటుడు, రచయిత, ప్రయోక్త, పత్రికాధిపతి దాసరి నారాయణ రావు (72) కన్నుమూశారు. కిమ్స్‌ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో శాశ్వత నిద్రలోకి వెళ్లారు.

బుధవారం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తోల్‌కట్ట వద్ద ఉన్న దాసరి ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.  అప్పటి నుంచి దాసరి సంతాప సభ నిర్వహించలేదు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దాసరిని అవమానపరుస్తున్నారనే విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.  అంతే కాదు సినీ ప్రముఖుల మధ్య ఉన్న విభేదాలే దీనికి కారణమంటూ పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.దీనిపై నిర్మాత సి.కల్యాణ్ వివరణ ఇచ్చారు. 80వ దశకంలో స్టార్స్ గా ఉన్న చాలా మంది ప్రస్తుతం చైనాలో ఉన్నారని... వారు అందుబాటులో లేని కారణంగానే ఇంతవరకు సంతాప సభను నిర్వహించలేదని ఆయన తెలిపారు.

10వ తేదీన సంతాప సభను నిర్వహిస్తామని చెప్పారు.  హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో రామానాయుడు కళామండపంలో జరిగే ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమకు సంబంధించిన 24 శాఖల టెక్నిషియన్స్ పాల్గొననున్నారు. సినీ ప్రముఖులు కొందరు షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉండడంతో సంతాప సభ ఆలస్యంగా నిర్వహిస్తున్నామని నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు.   ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ఈ సభకు ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ హాజరవుతారని తమ మధ్య ఎలాంటి గ్రూపుల్లేవని తెలిపారు.

https://www.youtube.com/watch?v=FslzNONyJ7w


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: