నీజతగా నేనుండాలి : రివ్యూ

సినిమాటోగ్రఫీ ,సంగీతం ,నిర్మాణ విలువలు సినిమాటోగ్రఫీ ,సంగీతం ,నిర్మాణ విలువలు సచిన్, నజియాల నటన ,వారి మధ్య సమన్వయం..,డైలాగ్స్ ,సాహిత్యం ,దర్శకత్వం

రాఘవ జైరాం (సచిన్ జోషి) ఒక పెద్ద గాయకుడు అతని ప్రతిభతో ఎన్నో పురస్కారాలను అందుకొని ఉంటాడు అలాంటి గాయకుడు మద్యానికి బానిసయ్యి తన ప్రభను కోల్పోతూ ఉంటాడు. అతని స్నేహితుడు వివేక్(శశాంక్) ఎంత వారించినా పట్టించుకోడు. గోవా లో ప్రదర్శన ఇస్తున్న సమయంలో రాఘవ్ కి గాయత్రీ నందన(నజియా హుస్సేన్)పరిచయం అవుతుంది. బార్లో పాటలు పాడి తన కుటుంబాన్ని పోషిస్తున్న గాయత్రి గాత్రం రాఘవ్ కి బాగా నచ్చి గాయిత్రి ని పెద్ద గాయిని ని చేస్తాడు. అదే సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడతారు కాని మద్యానికి బానిస అయిన రాఘవ్ ఆ అలవాటును దూరం చేసుకోవాలి అనుకున్నా దూరం చేసుకోలేడు. ఈ అలవాటు గాయత్రి కెరీర్ మీద కూడా ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. గాయత్రి ఎలాగయినా రాఘవ్ చేత ఈ అలవాటు మాన్పించాలని నిర్ణయించుకుంటుంది. చివరికి ఏమయ్యింది అనేది మిగిలిన కథ ....

సచిన్ జోషి మరోసారి తెలుగు పరిశ్రమలో తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ చిత్రం కాని హిందీ లో ఇప్పటికే బాగా పేరొచ్చిన ఇలాంటి ఒక పాత్రను ఎంచుకోవడమే అతను చేసిన మొదటి తప్పు... అది పక్కన పెట్టి ఈ చిత్రం గురించి మాత్రమే మాట్లాడితే అతను తన ప్రదర్శనలో బెస్ట్ ఇచ్చాడు కాని ఈ పాత్రకి అది పదిశాతం కూడా సరిపోలేదు. ఇటు మద్యానికి బానిసలా అనిపించలేదు అటు గాయకుడిలా కూడా అనిపించలేదు... ఇక కథానాయిక నజియా హుస్సేన్ రెండు మూడు సార్లు హిందీలో శ్రద్ద కపూర్ లా చెయ్యడానికి ప్రయత్నించి విఫలం అయినట్టు ఉంది ఆ తరువాత పూర్తిగా నటించడం మానేసింది. చిత్రం మొత్తం ఈ నటి కనబరించిన హావభావాలను వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇది ఆమెని అవమానించాలని అంటున్నది కాదు ఈ చిత్రం మొత్తం ఈ నటి పాత్ర మీదనే ఆధారపడి ఉంటుంది కాని ఈ నటిమాత్రం ఒక్క శాతం కూడా న్యాయం చెయ్యలేకపోయింది. అసలు ఈ నటి సన్నివేశాలను దర్శకుడు ఎలా ఒకే చేసారు అనే సందేహం అందరి మదిలో కచ్చితంగా మెదులుతుంది. రావు రమేష్ తనదయిన శైలిలో చిన్న పాత్రని కూడా రక్తి కట్టించారు. మిగిలిన నటీనటులందరు అలా కనిపించి వెళ్ళిపోయారు ....

కథ చాలా చిన్నది ఇప్పటికే చాలా చిత్రాలలో చూసిందే కాని రచయిత రఫీక్ ఈ చిత్రాన్ని పూర్తిగా కథనం మీదనే నడిపించారు. కథనంలో ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండేలా చూసుకున్నారు అంతే కాకుండా ప్రధాన పాత్రల మధ్యన కెమిస్ట్రీ మీదనే ఎక్కువగా నడిపించారు. ఇక్కడే సమస్య మొదలయ్యింది హిందీ లో లీడ్ పెయిర్ చిత్రాన్ని వాళ్ళ భుజాన వేసుకొని నడిపించారు కాని తెలుగులోకి వచ్చేసరికి సచిన్ మరియు నజియా ఆ స్థాయి నటన కనబరచకపోవడంతో కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది, అంతే కాకుండా ఫ్రెష్ నెస్ కూడా మిస్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఇందులో రచయితే తప్పు ఒక్కశాతం కూడా లేదు. ఇక మాటలు కూడా అంతగా ప్రభావం చూపలేకపోయాయి హిందీ టు తెలుగు అనువదించి వదిలేసారు. దర్శకత్వం విషయంలో జయ రవీంద్ర ఘోరంగా విఫలం అయ్యారు. సాంకేతికంగా ఎంత ఉన్నతంగా తీసినా కూడా ఈ చిత్రంలో నటనా నాణ్యత శూన్యం, పాత్రల మధ్యన సమన్వయం బొత్తిగా లేదు, ఈ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్త వహించాల్సింది అంతే కాకుండా ఈ చిత్రానికి కాస్త తెలుగు 'టచ్' ఇచ్చి ఉంటె బాగుండేది. ఇది మన చిత్రం అనే ఫీలింగ్ చిత్రంలో ఎక్కాడా అనిపించదు. సినిమాటోగ్రఫీ అందించిన వసంత్ పనితీరు అద్భుతం అని చెప్పాలి చిత్రం ఆసాంతం చాలా రిచ్ గా కనిపిస్తుంది. మిథూన్, జీత్ గంగూలీ మరియు అంకిత్ తివారి అందించిన సంగీతం చాలా బాగున్నప్పటికీ ఆ పాటలకు చంద్రబోస్ అందించిన సాహిత్యం సన్నివేశానికి బొత్తిగా నప్పలేదు. నేపధ్య సంగీతం బాగుంది, కాని హిందీలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది(ఇది ఫిర్యాదు కాదు). ఎడిటింగ్ పరవాలేదు ఇంకాస్త పదునుగా సన్నివేశాలను కత్తిరించి ఉంటె బాగుండేది.. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి..

నీ జతగా నేనుండాలి , ఆషికి 2 అనే చిత్రానికి ఇది రీమేక్.. హిందీ పరిశ్రమలో సెన్సేషనల్ హిట్ ఆషికి 2 కాని తెలుగుకి వచ్చేసరికి మాములు హిట్ అయ్యే పరిస్థితి కూడా లేదు.. ఎందుకిలా జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. ఆదిత్య రాయ్ కపూర్ నటన ఒక రాక్ స్టార్ లా కనిపించడమే కాకుండా మద్యానికి బానిస అయిన వ్యక్తిగా సరిగ్గా సరిపోయాడు నిజానికి ఆ పాత్రలో అతను జీవించాడు.. సచిన్ జోషి ఇతనిలో అటు రాక్ స్టార్ పోలికలు ఇటు మద్యానికి బానిస పోలికలు రెండు కనపడలేదు. శ్రద్ద కపూర్, హిందీ చిత్రానికి బాగా సహాయపడింది ఈమె నటన, అమాయకత్వం మరియు ఫ్రెష్ నెస్ కూడిన ఈ నటి నటన ఆ చిత్రానికి మేజర్ హైలెట్.. నజియా అనే మన తెలుగు హీరోయిన్ అసలు నటించలేదు మరోసారి చెప్తున్నాం ఒక్క సన్నివేశంలో కూడా నటించలేదు.. థియేటర్ బయట ఎవరో ప్రేక్షకుడు అన్నాడు వీళ్ళ యాక్టింగ్ తో పోలిస్తే హిందీలో చేసిన వాళ్ళది ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అని... నిజమే అనిపించింది సాంకేతికంగా ఇంత ఉన్నంతంగా ఉన్న ఈ చిత్రం ఇలాంటి ఫలితం రావడానికి అధిక శాతం కారణం వీరిద్దరి నటనే, ఎందుకంటే ప్రేమ గురించి చెప్తున్న చిత్రంలో ప్రేమ కనపడలేదు.. ఇద్దరి మధ్య బంధాన్ని చూపిస్తున్న చిత్రంలో బంధం కనపడలేదు.. ఈ ఒక్క కారణమే ఈ చిత్రానికి అర్ధం లేకుండా చేసేసింది. హిందీ లో వచ్చిన ఆషికి 2 చిత్రానికి చాలా మంది అభిమానులే ఉంటారు వారందరు ఈ చిత్రాన్ని చూసాక అనుకునే మాట ఇది "కొన్ని చిత్రాల రీమేక్ లు అమ్మకపోవడమే మంచిది" .. అవును నిజమే ఇలానే ఇంకొన్ని రీమేక్ చిత్రాలు ఉంటె భవిష్యత్తులో తెలుగు వారికి రీమేక్ లు అమ్మడానికి ఎవరు ఆసక్తి చూపకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు .. ఈ చిత్రం గురించి ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడుకోలేము.. హిందీ లో ఆషికి 2 చిత్రాన్ని చూడని వాళ్ళు ఆ చిత్రాన్ని చూడండి ఒకవేళ మీరు ఆ చిత్రం చూసి ఉంటె మరొకసారి అదే చిత్రాన్ని చూడండి .. నీ జతగా నేనుండాలి థియేటర్ లకి వెళ్లి చూడాల్సిన చిత్రం అయితే కాదు తరువాత మీ ఇష్టం ...

Sachiin J Joshi,Nazia Hussain,Jaya Ravindra,Bandla Ganesh,Mithoon.నీ జతగా నేనుండాలి : ఈ చిత్రానికి దూరంగా ఉండాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: