‘డేవిడ్ బిల్లా’ సహనానికి పరీక్ష

HANUMA HANUMA
 చిత్రం - డేవిడ్ బిల్లా నటీనటులు - అజిత్, పార్వతి ఓమన్ కుట్టన్, బ్రూణ అబ్దుల్ల, విద్యుత్ జమ్వాల్, సుధాంశు పాండే తదితరులు కెమెరా - ఆర్.డి.రాజశేఖర్, ఎడిటింగ్ - సురేష్ ఉర్స్,  రిలీజ్ - 13.7.12, రేటింగ్ - 3.5\10 డేవిడ్ బిల్లా (అజిత్) శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థుడు. శరణార్థుల శిబిరంలో తనపై పెత్తనం చూపించిన ముత్తు (తీపెట్టి గణేషన్)ను కొట్టడంతో అతనంటే మిగిలిన వారికి భయం కలుగుతుంది. డేవిడ్ తో రంజిత్ (యోగ్ జేపీ) కలిసి నడుస్తాడు. ఓ సారి షిప్ యార్డులో స్ట్రైక్ జరుగుతుంది. ఆ సమయంలో ఓ చేపల లోడ్ను హైదరాబాద్ కు తరలించాల్సి వస్తుంది. అందులో డైమండ్స్ ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న డేవిడ్ మరింత జాగ్రత్తగా వాటిని చేరాల్సిన చోటుకు చేరుస్తాడు. అలా అతని ప్రస్థానం మొదలవుతుంది. అక్కడి నుంచి కన్నన్, అబ్బాసీ అంటూ డాన్లతో పరిచయం కలుగుతుంది. అబ్బాసీ (సుధాంషు పాండే)తో స్నేహం చాలా దూరం వెళ్తుంది. ఇదంతా నచ్చని కన్నన్ వారిద్దరి మధ్య చిచ్చుపెడతాడు. వారిద్దరూ విడిపోతారు. ఆ క్రమంలోనే అబ్బాసీని డేవిడ్ చంపుతాడు. ఇంటర్నేషనల్ డాన్ డిమిత్రీ (విద్యుత్)తోనూ అతనికి ఓ డీల్ కుదరక వైరం పెరుగుతుంది. చివరికి ఏమైందన్నది కథ. డేవిడ్ మేనకోడలిగా జాస్మిన్ (పార్వతి), ప్రేయసి సమీరగా (బ్రూణ) నటించారు. విశ్లేషణ సినిమా ఎక్కడా లాజిక్ లకు అందదు. మనిషికి గతం, డాన్ కు చరిత్ర ఉంటుందని మొదటి నుంచి ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ డేవిడ్ బిల్లాకు చెప్పుకోదగ్గ చరిత్ర ఏమీ లేదు. బిల్లా స్థాయికి ఎదిగిన వ్యక్తికి ఆసక్తికరమైన గతాన్ని చూపించాలన్న కనీస తెలివి కూడా కథకులకు లేకపోయింది. ఫలితంగా కథనం పేలవంగా తయారైంది. చేతిలో నాలుగు తుపాకీలుంటే ఎవరైనా ఇంటర్నేషనల్ డాన్ అయిపోతారన్న చందాన తెరకెక్కించారు దర్శకుడు. చక్రి తోలేటి ఈ సబ్జెక్టును హ్యాండిల్ చేయలేకపోయారు. తెలుగులో అట్టర్ ఫ్లాపయిన పంజాలో కనీసం ఆత్మయినా ఉంటుంది. ఇందులో అది కూడా లేదు. స్క్రీన్ప్లే చేసినట్టు ఒకరికి నలుగురు పేర్లు కనిపిస్తాయి. బడ్జెట్ ను పెంచడానికి తప్పితే వారు చేసిన సేవలేంటో అర్థం కాదు. అలాగే కథలో ఏముందని ఇద్దరు అల్లారు? కేవలం డార్క్ బిజినెస్లు నాలుగింటి గురించి ఆలోచిస్తే కథ తయారయిపోతుందా? శరత్ మండవ తెరమీద నవ్వుల పాలయ్యారు. డైలాగులు కూడా ఏదో పంచ్ కోసం తాపత్రయపడ్డట్టు అనిపిస్తాయి.. డైలాగులు సినిమాలో చాలా వీక్. ఈ చిత్రం మొత్తానికి సంబంధించి ఎక్కడైనా ఎవరైనా కొత్తదనం కోసం ప్రయత్నించారా? అంటే అది ఒక్క ఆర్.డి.రాజశేఖర్ విషయంలోనే కనిపిస్తుంది. యువన్ నేపథ్య సంగీతం కొంత వరకు ఫర్వాలేదనిపించినా పాటలు మెప్పించవు. సినిమా మొత్తం పూర్తయ్యాక మేకప్ వేసుకుని యువన్ కనిపించే పాట అసలు అవసరమే లేదు. అదే విధంగా అజిత్ ఎంతో రిస్క్ చేసి చేసిన హెలికాప్టర్ సన్నివేశాలు ప్రేక్షకుల మెప్పు పొందలేవు. అదేదో గ్రాఫిక్స్ లా అనిపిస్తాయి.. అసలు సినిమా అయిపోలేదేంటి? అన్న విసుగులో ఉన్న ప్రేక్షకుడు ఆ విన్యాసాలను ఆస్వాదించే పరిస్థితే లేదు. అజిత్ స్టైల్ బావుంది. కానీ అది ఆయన బిల్లాలోనే చూపారు. అందువల్ల ఇక్కడ కొత్తగా అనిపించదు. నాయకలు ఇద్దరికీ సరైన పాత్ర లేదు. వారిద్దరిలో ఎవరు ఎవరో గుర్తుపట్టేలోపు సినిమా అయిపోతుంది. ఫాటల్లో అంతమంది ప్రత్యేకంగా నర్తించినా ఎక్కడా చూడాలన్నంత ఆసక్తి ఉండదు. సినిమా మొత్తం లొసుగుల మయం. ఎ సెంటర్ ప్రేక్షకులు ఈ తరహా హాలీవుడ్ చిత్రాలను కోకొల్లలు చూసి ఉంటారు కనుక ఈ చిత్రాన్ని మెచ్చరు. బీ,సీల ప్రేక్షకులకు కావల్సిన మసాలా దినుసులు ఇందులో ఉండవు గనుక వారికి చేరువవదు. ఏ విధంగా ఆలోచించినా డేవిడ్ బిల్లా ప్రేక్షకులకు చేరువ కాలేడు. - మిథున్ 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: