రివ్యూ : పాపం ప్ర‌తాప్‌

RAMAKRISHNA S.S.
న‌టీన‌టులు:  తిరువీర్‌, అజ‌య్‌ఘోష్‌, రాశీ పాయ‌ల్ రాధాకృష్ణ‌, దేవిప్ర‌సాద్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, ర‌వి ఆంటోనీ, ర‌ఘుబాబు, ప్ర‌సాద్‌బాబు, శ్రీనివాస అవ‌స‌రాల‌ త‌దిత‌రులు
మ్యూజిక్‌: కేఎం. రాధాకృష్ణ‌, సురేష్ బొబ్బిలి ( నేప‌థ్య సంగీతం )
సినిమాటోగ్ర‌ఫీ: విశ్వేశ్వ‌ర్ ఎస్‌.వి
ఎడిట‌ర్‌: అన్వ‌ర్ ఆలీ
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్పీ. దుర్గా న‌రేష్‌
రిలీజ్ డేట్‌: 17 - 04 - 2026


ప‌రిచ‌యం :
యువ క‌థానాయ‌కుడు తిరువీర్‌కు మంచి క‌థ‌ల‌తో సినిమాలు చేస్తాడ‌న్న పేరుంది. ఈ క్ర‌మంలోనే తిరువీర్ నుంచి తాజాగా వ‌చ్చిన సినిమా పాపం ప్ర‌తాప్‌. ఈటీవీ విన్ కూడా ఇటీవ‌ల మంచి క‌థాభిరుచి ఉన్న సినిమాలు తీస్తూ హిట్లు కొడుతోంది. దీనికి తోడు పాపం ప్ర‌తాప్ సినిమా ట్రైల‌ర్‌కు కూడా మంచి రెస్సాన్స్ రావ‌డంతో సినిమా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉంది ? అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థ :
ప్రతాప్ ( తిరువీర్‌) కి బుజ్జమ్మ ( పాయల్ రాధాకృష్ణ ) అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ. బుజ్జ‌మ్మ ప్రేమ పొందేందుకు ఎంతో కష్టపడతాడు. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో ? అన్న ఉత్సాహంతో ఇద్దరు కలిసి ఏడడుగులు వేసేస్తారు. తొలి మూడు రాత్రులు అలా గడిచాయో లేదో హీరో - హీరోయిన్ల మధ్య గొడవ మొదలవుతుంది. చివరికి పంచాయతీ రచ్చకెక్కుతుంది. అయితే ప్రతాప్ కి ఒక సమస్య ఉందని బుజ్జమ్మ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ సమస్య ఏంటనేది మాత్రం ఎవరికీ చెప్పదు.. ప్రతాప్ కి ఉన్న సమస్య ఏంటో ? తనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే తాను కాపురానికి వస్తానని బుజ్జమ్మ తెగేసి చెబుతుంది. బుజ్జమ్మ అంటే గుండెలనిండా ఎంతో ప్రేమ నింపుకున్న ప్రతాప్.. తనలోని సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? ఇంతకీ ఆ సమస్య ఏమిటి ?  దానిని సరిదిద్దుకున్నాడా లేదా ? బుజ్జమ్మ - ప్రతాప్ ఒకటయ్యారా లేదా అన్నదే ఈ సినిమా కథ.


విశ్లేష‌ణ :
ఈ సినిమా ప్రధాన వృత్తాంతం అంతా వదులుకోలేని ప్రేమ.. కలిసి బతకలేని సమస్య అన్న ఈ రెండు సంఘర్షణల మధ్య జరుగుతుంది. చివరికి ఈ పోరులో ప్రేమ గెలిచిందా ? లేదా హీరోకు ఉన్న సమస్య పై చేయి సాధించిందా ?అన్నదే ఈ సినిమాలో కీలక అంశం. 1991 వ ద‌శ‌కంలో గోదావరి పల్లెటూరి నేపథ్యంలో ఓ మంచి ప్రేమ కథలా సరదా సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. ప్రేక్షకులు అంతా 30 ఏళ్లు వెనక్కి వెళ్లి ఒక పల్లెటూరి అందమైన ప్రేమ కథను ఎంజాయ్ చేయటం మొదలు పెడతారు. హీరోకి ఉన్న సమస్య ఏమిటి ? అనేది వెంటనే బయటకు చెప్పకుండా ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించాడు దర్శకుడు. హీరోలోని సమస్య కనుక్కునేందుకు హీరో తన స్నేహితుడితో కలిసి చేసే ప్రయాణం.. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తాయి. మరోవైపు హీరోయిన్ తనకు ఎదురవుతున్న సమస్యని అత్తవారింటికి లేదా పుట్టింటికి వచ్చి చెప్పకుండా.. నేరుగా ఊరు పెద్దల మధ్యకు తీసుకువెళ్లి పంచాయితీ పెట్టటం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరోకు ఉన్న సమస్యకు.. హీరోలోని ప్రేమకు ముడిపెట్టిన సన్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్లతో కథ‌ మరో మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ లో హీరోకి ఉన్న సమస్య మూలాల గురించి చెప్పే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కూడా అద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తాయి. క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు అంతకుముందు డ్రామా కూడా ర‌క్తికడుతుంది. రచ్చబండ నేపథ్యంలో ఊరి జనాలకి.. హీరోకు మధ్య సన్నివేశాలు కామెడీతో ఆకట్టుకుంటాయి. సరైన కామెంట్ ని ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి.


న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే
ప్రతాప్‌ పాత్రలో తిరువీర్‌ పూర్తిగా ఒదిగిపోయి న్యాయం చేశాడు. కాస్త అమాయకత్వం.. కాస్త చలాకీ తనం కలిసిన ఆ పాత్రలో చాలా సహజంగా నటించాడు. హీరోయిన్ పాయల్‌ రాధాకృష్ణ కూడా పాత్రకు తగిన న్యాయం చేసింది. ఇక మాటలతో విరుచుకు పడే పాత్రలో అజయ్ ఘోష్ కనిపిస్తారు. అజయ్ ఘోష్‌కు జోడిగా ఒకప్పటి హీరోయిన్ రాశి కనిపిస్తారు. క్లైమాక్స్‌లో రాశి నటన మెప్పిస్తుంది. ప్రసాద్ బెహరా - గోపరాజు రమణ - రఘుబాబు - దేవి ప్రసాద్ - మహబూబ్ బాషా - రవి ఆంథోనీ వీళ్లంతా కీలకమైన పాత్రలలో న‌టించి తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. టెక్నికల్ విభాగాలలో రాధాకృష్ణన్ పాటలు మెప్పిస్తాయి. ఎడిటింగ్ కొన్నిచోట్ల కత్తెర పడాల్సి ఉంది. టెక్నికల్గా మిగిలిన విభాగాలు అన్ని బాగా ఎఫర్ట్ పెట్టి పనిచేసినట్టుగా ఉంది.


దర్శకుడు దుర్గా న‌రేష్‌ విషయానికి వస్తే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే మంచి కథ అంశాన్ని ఎంచుకున్నాడు. కథనం పరంగా బాగుంది. అయితే సన్నివేశాల రచనలో ఇంకాస్త పదును పెడితే.. సినిమా రేంజ్ వేరేగా ఉండేది. మాటలు బాగున్నాయి. తిరువీర్ న‌ట‌న‌, హీరోయిన్ పాత్ర‌, సెకండాఫ్‌.. సినిమా స్టార్టింగ్‌.. మెయిన్ క‌థాంశం... పాట‌లు, వ‌ర్క‌వుట్ అయిన కామెడీ, రాశీ పాత్ర సినిమాకు ప్ల‌స్ పాయింట్స్ కాగా... కొన్నిచోట్ల సాగ‌దీత స‌న్నివేశాలు సినిమాకు మైన‌స్ అయ్యాయి.


ఫైన‌ల్‌గా...
పాపం ప్ర‌తాప్‌.. ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను మెప్పించి ... న‌వ్విస్తాడు.


పాపం ప్ర‌తాప్ రేటింగ్ : 3 / 5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: