డైరెక్టర్ మారుతిపై రెబల్ ఫ్యాన్స్ ఆగ్రహం.. అసలు కారణమేంటి?

Amruth kumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, గ్లామర్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కలయికలో దర్శకుడు మారుతీ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ హారర్ కామెడీ 'ది రాజా సాబ్' (The raja Saab) బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయితే, సినిమా విడుదలయ్యి పది రోజులు దాటిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ దర్శకుడు మారుతీపై 'మాస్' అటాక్ మొదలుపెట్టారు.బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రేంజ్ ఏంటో 'సలార్', 'కల్కి' నిరూపించాయి. అందుకే 'ది రాజా సాబ్' పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్ రోజున ప్రభాస్ వింటేజ్ లుక్ చూసి మురిసిపోయిన అభిమానులు, ఇప్పుడు మాత్రం సీన్ కట్ చేస్తే డైరెక్టర్ మారుతీని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సినిమా కలెక్షన్ల పతనం మరియు మారుతీ చేసిన కొన్ని వ్యాఖ్యలే అని తెలుస్తోంది.



సినిమా రిలీజ్ కు ముందు మారుతీ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. ఏకంగా తన విల్లా నంబర్ 17 (కొండాపూర్) ఇస్తూ.. "సినిమా గనుక 1 శాతం డిసప్పాయింట్ చేసినా నా ఇంటికి రండి" అంటూ సవాల్ విసిరారు.ఇప్పుడు సినిమా బాక్సాఫీస్ వద్ద డల్ అవ్వడంతో, ఫ్యాన్స్ ఆ అడ్రస్ పట్టుకుని ట్రోల్స్ మొదలుపెట్టారు. "చెప్పినట్టుగా సినిమా లేదు, ఇప్పుడు నీ అడ్రస్ కు వస్తున్నాం.. సమాధానం చెప్పు" అంటూ ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కంటే బాడీ డబుల్స్ ఎక్కువగా వాడారని, కొన్ని సీన్లలో ప్రభాస్ ఒరిజినల్ మేనరిజమ్స్ మిస్ అయ్యాయని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.సినిమాకు నెగటివ్ టాక్ రావడంపై మారుతీ స్పందిస్తూ.. "ఎవరైతే సినిమాను కావాలని తక్కువ చేస్తున్నారో, వారు భవిష్యత్తులో కర్మను అనుభవిస్తారు" అని చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.



"సినిమా బాగోలేదని చెప్పడం మా తప్పా? దానికి కర్మ అని శాపనార్థాలు పెడతావా?" అంటూ సామాన్య ప్రేక్షకులు కూడా మారుతీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ప్రభంజనానికి ముందు 'రాజా సాబ్' నిలవలేకపోయింది.మొదటి రోజు ₹100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, ఆ తర్వాత భారీగా పడిపోయింది.సుమారు ₹350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా చాలా రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాల అంచనా.సినిమా ఫైనల్ రన్ దాదాపు ముగింపుకు రావడంతో, కచ్చితమైన నష్టాల లెక్కలు బయటకు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ ఇమేజ్ కు మారుతీ దెబ్బకొట్టారని అభిమానులు ఇప్పుడు మరింత సీరియస్ అవుతున్నారు.ప్రస్తుతానికి మారుతీ ఈ ట్రోల్స్ పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ ను కేవలం ఒక హారర్ కామెడీకి పరిమితం చేసి, బలమైన కథ లేకుండా సినిమా తీశారన్న అపవాదు మాత్రం మారుతీపై గట్టిగానే పడింది.


సినిమా అన్నప్పుడు జయాపజయాలు సహజం. కానీ, ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకున్నప్పుడు లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించినప్పుడు ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. మారుతీ ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో చూడాలి. ఏదేమైనా, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పట్లో ఆయన్ని వదిలేలా లేరు!డార్లింగ్ ఇమేజ్ మాస్.. మారుతీ లెక్కలు మిస్! 'రాజా సాబ్' వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: