హుక్ స్టెప్‌తో సోషల్ మీడియాను ఊపేసిన మెగాస్టార్!

Amruth kumar
బాస్ ఈజ్ బ్యాక్.. విత్ డబుల్ ఎనర్జీ! వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి స్టెప్పేస్తే రికార్డులు తిరగరాయాల్సిందే. ఆయన చిటికె వేస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా నుంచి ‘హుక్ స్టెప్’ అనే సాంగ్ విడుదలయ్యింది. ఈ పాట చూశాక ఒకటే మాట వినిపిస్తోంది.. "డ్యాన్స్ అనే పదానికి నిఘంటువు మారదు, అది ఎప్పటికీ మెగాస్టారే!" అని. 70 ఏళ్ల వయసులో, ఇటీవలే మోకాలి సర్జరీ చేయించుకుని కూడా ఆయన వేసిన స్టెప్పులు చూస్తుంటే యువ హీరోలకు సైతం చెమటలు పట్టడం ఖాయం.సాధారణంగా ఏ హీరో సినిమా వచ్చినా ఒక సిగ్నేచర్ స్టెప్ (Hook Step) ఉంటుంది. కానీ, ఈ పాట పేరులోనే ‘హుక్ స్టెప్’ అని పెట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఇందులో చిరు డ్యాన్స్ విన్యాసాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ పాటను లాంచ్ చేశారు.



ఈ పాటలో చిరంజీవి అల్ట్రా కూల్ లుక్‌లో మెరిసిపోయారు. పక్కా మాస్ అండ్ స్టైలిష్ స్టెప్పులతో రచ్చ చేశారు. ముఖ్యంగా ఆయన సిగ్నేచర్ గ్రేస్, ఆ ఈజ్ చూస్తుంటే మళ్ళీ 90ల నాటి వింటేజ్ చిరంజీవి గుర్తొస్తున్నారు. ఈ పాట చూసిన నెటిజన్లు “ఎవడ్రా చిరు గ్రేస్ తగ్గిందంది.. ఈ వీడియో చూడండిరా!” అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు.
ఈ పాటలో మరో హైలైట్ ఏమిటంటే.. 90వ దశకంలో తన ర్యాప్ సాంగ్స్‌తో ఇండియాను ఊపేసిన బాబా సెహగల్ ఈ పాటను పాడటం. 1995లో ‘రిక్షావోడు’ సినిమాలోని ‘రూప్ తేరా మస్తానా’ తర్వాత దాదాపు 30 ఏళ్లకు బాబా సెహగల్ మళ్ళీ చిరంజీవి కోసం తన గొంతును సవరించారు. ఆయన వాయిస్‌లోని ఎనర్జీ, భీమ్స్ సిసిరోలియో అందించిన ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్ కలిసి ఈ పాటను ఒక ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా మార్చేశాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ యువతను, ముఖ్యంగా ఇంట్రోవర్ట్స్ ను బయటకు వచ్చి స్టెప్పులు వేయమనేలా ఉత్సాహపరుస్తున్నాయి.



ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కేవలం వీడియో మాత్రమే కాదు.. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ మీద ఈ హుక్ స్టెప్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనతో పాటు విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కలిసి స్టెప్పులేయడంతో ఆడిటోరియం మొత్తం హోరెత్తిపోయింది. చిరు-వెంకీలను ఒకే ఫ్రేమ్‌లో, అది కూడా అంత జోష్‌గా డ్యాన్స్ చేస్తూ చూడటం మెగా ఫ్యాన్స్‌తో పాటు విక్టరీ ఫ్యాన్స్‌కు కూడా కనువిందుగా మారింది. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.



ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చిరంజీవి తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నారట. డాక్టర్లు సర్జరీ సజెస్ట్ చేసినా, సినిమా సంక్రాంతికి రావాలని, ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని ఆ నొప్పిని భరిస్తూనే షూటింగ్ పూర్తి చేశారు. షూటింగ్ ముగియగానే ఇటీవలే ఆయనకు చిన్న సర్జరీ కూడా జరిగింది. ఇంత కష్టపడి ఆయన వేసిన స్టెప్పులే ఇప్పుడు స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తున్నాయి. ఈ డెడికేషన్ చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. "అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు" అని సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.



ఈ పాటలో గ్లామర్ డోస్ పెంచడానికి క్యాథరిన్ ట్రెసా తన అందం, అభినయంతో మెప్పించింది. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ‘ఆట సందీప్’ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ప్రతి స్టెప్ కూడా యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉండేలా ఆయన డిజైన్ చేశారు. ఇప్పటికే వేల సంఖ్యలో రీల్స్ ఈ సాంగ్ తో సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి.



జనవరి 12న విడుదల కాబోతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించడం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో కామెడీ అండ్ యాక్షన్ మిక్స్ చేసి ఈ సినిమాను రూపొందించారు."వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే" అని మెగాస్టార్ మరోసారి నిరూపించారు. ‘హుక్ స్టెప్’ సాంగ్ తో మొదలైన ఈ ఊపు, సంక్రాంతి నాడు థియేటర్లలో భారీ వసూళ్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. మెగా ఫ్యాన్స్ ఆల్రెడీ స్పీకర్లు రిపేర్ చేయించుకుంటున్నారు.. ఎందుకంటే జనవరి 12న థియేటర్లలో పూనకాలు లోడింగ్..!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: