జ‌న‌నాయ‌గ‌న్ షాకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్‌... విజ‌య్ వాటే క్రేజ్‌.. !

RAMAKRISHNA S.S.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన రాజకీయ ప్రయాణానికి ముందు నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ విధ్వంసం :
విజయ్ క్రేజ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి నిరూపితమవుతోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, విదేశాల్లో ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటివరకు దాదాపు రూ. 15 కోట్లు వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదలవుతుండటంతో, ఓపెనింగ్ డే రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.


రీమేక్ వివాదం: దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు :
ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు హెచ్. వినోద్ దీనిపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.  "ఇది రీమేక్ అని నేను ధ్రువీకరించను, అలాగని కొట్టిపారేయను. ఇది కేవలం ఒక 'దళపతి మూవీ'. ఇది ఏదైనా సినిమా నుంచి స్ఫూర్తి పొందిందా లేదా రీమేకా అనే టెన్షన్ ప్రేక్షకులకు వద్దు. థియేటర్లకు వచ్చి సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. దర్శకుడి సమాధానం సందిగ్ధంగా ఉండటంతో అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. అయితే శ‌నివారం విడుదల కాబోతున్న ట్రైలర్ తో ఈ సినిమా కథాంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


విజయ్ కెరీర్‌లో మైలురాయి :
తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న విజయ్‌కి ఇది ‘ఫేర్‌వెల్’ మూవీ లాంటిది. ఇందులో ఆయన పోషించిన రాజకీయ నాయకుడి పాత్ర, నిజ జీవితంలో ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’కు మైలేజ్ ఇచ్చేలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇది ‘భగవంత్ కేసరి’ రీమేక్ అయినప్పటికీ, విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా హెచ్. వినోద్ కథలో భారీ మార్పులు చేసినట్లు సమాచారం. రేపు విడుదల కాబోయే ట్రైలర్ ఈ సస్పెన్స్ కి తెరదించుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: