లవర్ బాయ్ ఇమేజ్ నుంచి లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్ వరకు....!

Amruth kumar
ఒకప్పుడు టాలీవుడ్‌లో 'లవర్ బాయ్' ఇమేజ్‌తో యువతను ఊరూతలూగించిన హీరో తరుణ్ . 'నువ్వే కావాలి', 'ప్రియమైన నీకు', 'నువ్వు లేక నేను లేను' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్‌డమ్ అందుకున్న ఆయన, గత కొంతకాలంగా వెండితెరకు దూరమయ్యారు. తరుణ్ సినిమా కెరీర్‌కు ఎందుకు బ్రేక్ పడింది? ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అనే విషయాలపై ఆయన తల్లి, సీనియర్ నటి రోజా రమణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.



తరుణ్ సినిమాలకు దూరం కావడానికి కారణం అవకాశాలు లేకపోవడం కాదు, ఆయన ఆసక్తి మారడమేనని రోజా రమణి తెలిపారు.కెరీర్ ప్రారంభంలో అద్భుతమైన విజయాలు అందుకున్న తరుణ్‌కు, ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఆయన తన కెరీర్ గురించి పునరాలోచనలో పడ్డారు."తరుణ్ ఎప్పుడూ తన నిర్ణయాలను తనే తీసుకుంటాడు. సినిమాల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, బలవంతంగా సినిమాలు చేయడం కంటే.. తనకు నచ్చిన మరో రంగంలో స్థిరపడాలని భావించాడు" అని రోజా రమణి పేర్కొన్నారు.



తరుణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి వ్యాపారవేత్తగా మారారు. హైదరాబాద్‌లో 'మే డే' (May Day) అనే ప్రసిద్ధ స్పోర్ట్స్ బార్‌తో పాటు మరికొన్ని వ్యాపారాలను ఆయన విజయవంతంగా నిర్వహిస్తున్నారు. నటన కంటే వ్యాపారంలోనే ఆయన ఎక్కువ సంతృప్తిని పొందుతున్నారని ఆమె వెల్లడించారు.సినిమాల కంటే కూడా తరుణ్‌కు క్రీడలంటే మొదటి నుండి మక్కువ ఎక్కువ. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో 'తెలుగు వారియర్స్' జట్టుకు తరుణ్ కీలక ఆటగాడు. సినిమాలకు దూరమైనా, క్రికెట్ ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నారు.



 గ్లామర్ ప్రపంచం కంటే ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికే తరుణ్ ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే మళ్ళీ వెండితెరపైకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.తరుణ్ కేవలం హీరోగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన సినిమాల్లోకి తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నప్పటికీ, వ్యాపార రంగంలో ఆయన సాధిస్తున్న విజయం పట్ల కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. రోజా రమణి మాటలను బట్టి చూస్తే, తరుణ్ తన లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా ప్లాన్డ్‌గా ఎంజాయ్ చేస్తున్నారని అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: