పాన్ ఇండియా స్టేటస్ వచ్చేసింది..ఇక ఎన్టీఆర్ ఆ పని చేయడానికి ఒప్పుకుంటారా ?

Thota Jaya Madhuri
పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు రూపొందుతున్న ఈ తరుణంలో, హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభు’ ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. పూర్తి స్థాయి పిరియాడికల్ మైథలాజికల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. నిఖిల్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, కాన్సెప్ట్ విజువల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో, ప్రతి భాషలోనూ సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణ కల్పించేందుకు టీమ్ ప్రయత్నిస్తోంది.



ఈ క్రమంలోనే తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే… ఈ చిత్ర కథా నేపథ్యాన్ని, ప్రధాన పాత్రల ప్రాధాన్యతను ప్రేక్షకులకు పరిచయం చేసే వాయిస్ ఓవర్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సంప్రదించాలని మేకర్స్ భావిస్తున్నారట. ముఖ్యంగా తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఉంటే సినిమాకు మరింత స్థాయి పెరుగుతుందని టీమ్ నమ్మకం. మరోవైపు, హిందీ వెర్షన్ కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ను ట్రై చేస్తున్నట్లు సమాచారం.



ఇక ఎన్టీఆర్ ఇప్పటికే పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు తన వాయిస్ ఇచ్చి అదరగొట్టిన విషయం తెలిసిందే. అలాగే అజయ్ దేవగణ్ కూడా పలు భారీ చిత్రాలకు నారేషన్ ఇచ్చారు. అలాంటి నేపథ్యంలో, నిఖిల్ సినిమా కోసం ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ తమ విలువైన వాయిస్‌లను ఇవ్వడానికి ఒప్పుకుంటారా? లేదా? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికర చర్చగా మారింది. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 13, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ కావడంతో, ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని సమాచారం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనుందని టాక్.హీరోయిన్లుగా సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. ఆయన విజువల్స్ ఈ మైథలాజికల్ ప్రపంచాన్ని మరింత అద్భుతంగా తెరపై చూపించనున్నాయని అంచనా.



ఈ భారీ ప్రాజెక్ట్‌ను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఒకే సమయంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండటంతో, ‘స్వయంభు’ నిజంగానే నిఖిల్ కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.మరి ఇంత భారీ అంచనాల మధ్య, ఎన్టీఆర్ మరియు అజయ్ దేవగణ్ వాయిస్ ఓవర్ అంశంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆ ప్రకటన వచ్చాక ‘స్వయంభు’ హైప్ మరింత రెట్టింపు అవడం ఖాయం అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: