అదే బాలయ్య పాలిట శనిలా దాపురించిందా..? మరోసారి ‘అఖండ 2’తో బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్..!

Thota Jaya Madhuri
తెలుగు సినీరంగంలో నందమూరి బాలకృష్ణ ఒక స్టార్ హీరోగా వెలుగొందుతున్నప్పటికీ, నిర్మాతగా ఆయన ప్రయాణం మాత్రం అంతగా సాఫీగా సాగలేదని పలువురు పేర్కొంటారు. ముఖ్యంగా ఆయన సమర్పకుడిగా వ్యవహరించిన కొన్ని సినిమాలకు సంబంధించి ఇది తరచూ చర్చకు వస్తోంది. ‘బాలగోపాలుడు’, ‘ప్రాణానికి ప్రాణం’, ‘సుల్తాన్’, ‘అల్లరి పిడుగు’ వంటి సినిమాలకు బాలకృష్ణ సమర్పకుడిగా వ్యవహరించారు. అయితే వీటిలో 'బాలగోపాలుడు' సినిమా మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని సాధించగా, మిగిలిన చిత్రాలు పెద్దగా నడవలేదు. అందువల్ల నిర్మాతగా వ్యవహరించడంలో బాలయ్యకు పెద్దగా అదృష్టం కలిసిరాలేదన్న అభిప్రాయాలు అప్పుడు అప్పుడూ వినిపించాయి.



ఆ తరువాత తన ఇద్దరు కూతుళ్లైన బ్రాహ్మణి, తేజస్విని పేర్లు కలిసేలా ‘బ్రహ్మతేజ క్రియేషన్స్’ అనే బ్యానర్‌ను స్థాపించి అధికారికంగా రిజిస్టర్ చేయించారు. మొదట ఈ బ్యానర్ ద్వారా వరుస సినిమాలు నిర్మించాలనే ఆలోచన బాలయ్యకు ఉన్నప్పటికీ, ఏదో కారణంగా ఆ ప్లాన్ కొనసాగలేదు. అప్పటి సమాచారం ప్రకారం, ఆయన జాతక ప్రకారం చిత్ర నిర్మాణం ఆయనకు చూడదని, ముఖ్యంగా నిర్మాతగా వ్యవహరిస్తే ఆర్థికంగా మంచిది కానని కొంతమంది జ్యోతిష్యులు సూచించడంతో, ఆ నిర్ణయంపై ఆయన వెనక్కు తగ్గారని సినీ వర్గాల్లో అప్పట్లో ప్రచారం జరిగింది.



ఇలా చాలా సంవత్సరాలపాటు నిర్మాణం నుంచి దూరంగా ఉన్న బాలకృష్ణ, అనంతరం తన తండ్రి అయిన మహానటుడు ఎన్టీఆర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా సినిమాలు నిర్మించారు. ఈ సినిమాలు బాలయ్య వ్యక్తిగతగానూ, కుటుంబపరంగానూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు. అయితే ప్రేక్షకులు, విమర్శకులు ఈ సినిమాలను పెద్దగా ఆదరించకపోవడంతో, విడుదల సమయంలో బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలు నమోదయ్యాయి. ఈ చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడంతో, అందులో పెట్టుబడులు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రమైన నష్టాల పాలయ్యారు.



ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ బయోపిక్‌ విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తానే నిర్మాతగా మరో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తానని బాలయ్య ఘనంగా ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్టు విషయంలో చివరికి మార్పులు చోటుచేసుకుని, ఆ సినిమా మిర్యాల రవీందర్ రెడ్డి బ్యానర్‌లో తెరకెక్కింది. అదే ‘అఖండ’ సినిమా. విడుదలయ్యాక ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచి, బాలయ్య కెరీర్‌లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ గా మారడమే కాకుండా, ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాదులు వేసింది.తరువాత ఆయన చిన్న కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించిన ‘అఖండ 2 – తాండవం’ అనే సీక్వెల్ ను కూడా ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ప్రీమియర్స్ వేయడానికి కేవలం మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిన సమయంలో, టెక్నికల్ కారణాల వల్ల సినిమాను విడుదల చేయలేమని నిర్మాణవర్గం సడెన్‌గా ప్రకటించింది. చివరికి ఆ సినిమా మొత్తంగా వాయిదా పడింది. ఫ్యాన్స్ అయితే ఈ జరిగిందంతా దురదృష్టకరంగా భావించారు.



ఇదిలా ఉంటే, బాలయ్య ఏకైక కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో భారీ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు కూడా తేజస్వి నందమూరి సమర్పకురాలిగా వ్యవహరించారు. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా షూటింగ్ ప్రారంభమయ్యేలోపే ఆగిపోయింది. దీంతో మళ్ళీ ఇదే వ్యాఖ్యలు ముందుకు వచ్చాయి – బాలయ్య కుటుంబానికి నిర్మాణం కలిసిరాకపోవడం ఇదే అంటూ పలువురు అన్నారు.మొత్తానికి, బాలయ్య కుటుంబం నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ప్రతిసారి ఏదో ఒక ప్రతికూల పరిస్థితి ఎదురవుతుందన్న భావన ప్రేక్షకులలో మాత్రమే కాదు, ఆయన అభిమానుల్లో కూడా బలంగా ఉందనేది వాస్తవం. ఇదే కారణంగా నేటికీ బాలయ్య నిర్మాణానికి దూరంగా ఉండడం, కేవలం నటనపైనే దృష్టి పెట్టడం మంచిదనే అభిప్రాయం చాలా వర్గాల్లో వినిపిస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: