స్టార్ హీరోల రెమ్యునరేషన్.. నిర్మాత పాత అప్పులకూ గ్యారంటీగా మారాలా?
నిర్మాత మోసం.. హీరోపై భారం! :
ఒక సినిమా చేయడానికి హీరో డేట్స్ ఇస్తాడు. దర్శకుడు, టెక్నీషియన్లు కష్టపడతారు. ఆ సినిమా బడ్జెట్‌లో సింహభాగం హీరో రెమ్యునరేషనే ఉంటుంది. మరి ఇంత చేసిన తర్వాత, 'మీ కర్మ' అంటూ ఏళ్లనాటి పాత బాకీల చిక్కులు తెచ్చి, సినిమా విడుదలను ఆపితే.. ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. నిర్మాతలు తమ విశ్వసనీయతను కోల్పోతే, వారిని నమ్మి ఇంకెవరూ డబ్బు ఇవ్వడానికి ముందుకు రారు. పాత అప్పులు చెల్లించకుండా, కొత్త సినిమా లాభాలను కేవలం తమ స్వలాభం కోసం వాడుకోవాలని చూసే ధోరణి చాలా ప్రమాదకరం!
పవన్ కల్యాణ్ ఉదంతం - ఒక నైతిక బాధ్యత! :
'పవన్ కల్యాణ్ అయితే నిర్మాత కష్టాలను తీర్చి సినిమాను రిలీజ్ చేయించుకున్నారు కదా?' అని కొందరు వాదిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు! ఆ సినిమా ఐదేళ్ల పాటు షూటింగ్ ఆలస్యం అవడానికి ప్రధాన కారణం పవన్ కల్యాణేనని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. తన వల్ల ఆలస్యం జరిగింది కాబట్టి, నిర్మాతకు అండగా ఉండాలనే నైతిక బాధ్యతతో పవన్ తన రెమ్యునరేషన్‌లో కొంత తిరిగి ఇచ్చారు. అది తన సినిమాకు సంబంధించిన 'ప్రస్తుత' ఆర్థిక ఒత్తిడిని తీర్చడం! అంతేకానీ, తన సినిమాతో సంబంధం లేని పాత బాకీలను కూడా ఒక హీరో తీర్చాలంటే.. ఈ సినీ పరిశ్రమ వ్యాపారం అవుతుందా? లేక ధార్మిక సంస్థ అవుతుందా?
హీరోలు సొంతంగా సినిమాలు ఎందుకు తీయకూడదు? :
నిర్మాతల పాత అప్పులు, ఆర్థిక అస్తవ్యస్తతను కూడా హీరోలే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తే, వారు ఇక బయటి బ్యానర్లలో సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది? తామే సొంత బ్యానర్లు పెట్టుకుని, తమ రెమ్యునరేషన్‌తో పాటు, సినిమా లాభాలను కూడా తమ ఖాతాలోనే వేసుకుంటారు కదా! అభిరుచి ఉన్న, నిజాయితీ కలిగిన నిర్మాతలు పరిశ్రమకు అవసరం. సినిమాను ఆపితే హీరో వస్తాడు, అప్పు తీరుస్తాడు అనే సంకేతం ఇస్తే.. అది నిర్మాతలకు మరింత నిర్లక్ష్యాన్ని, అహంకారాన్ని పెంచినట్లే అవుతుంది. ఒక హీరో కష్టం, దర్శకుడి విజన్... ఇదంతా నిర్మాత చేతకానితనం వల్ల రోడ్డున పడకూడదు. అనాలోచిత ఆర్థిక లావాదేవీలకు హీరోను బాధ్యుడిని చేయాలని చూడటం అన్యాయం, అసమంజసం! ఈ ధోరణి మారకపోతే, టాలీవుడ్‌లో చిన్న, కొత్త నిర్మాతలు మనుగడ సాగించడం కష్టమే!