అదే బాలయ్య కొంప ముంచిందా..? అఖండ 2 వాయిదా కి మెయిన్ కారణం ఇదే..!

Thota Jaya Madhuri
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. ఈ చిత్ర విడుదలపై గత కొన్ని గంటలుగా సినీ వర్గాల్లో తీవ్ర సందిగ్ధత నెలకొన్న విషయం ఇప్పటికే తెలిసినదే. ముఖ్యంగా, చిత్రానికి సంబంధించి కొన్ని అనుకోని సమస్యలు తలెత్తినట్లు ప్రచారంలోకి వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆందోళనకు గురి చేశాయి.సాధారణంగా పెద్ద సినిమాల ప్రీమియర్లు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అయితే గురువారం రాత్రి జరగాల్సిన ప్రీమియర్ షోలు అకస్మాత్తుగా రద్దు చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అభిమానులు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య అనేక రకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్ణయం ఎట్టకేలకు అధికారికంగా వెలువడింది.



తాజాగా నిర్మాతలైన 14 రీల్స్ ప్లస్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ‘అఖండ 2’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ ప్లాన్ మార్చాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపారు.



నిర్మాణ సంస్థ తమ అధికారిక పోస్టులో ఇలా పేర్కొంది:“అనివార్య పరిస్థితుల కారణంగా ‘అఖండ 2’ నిర్ణయించిన తేదీకి విడుదల కావడం లేదు. ఈ విషయం మాకు కూడా అత్యంత బాధాకరం. అభిమానులు, ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటున్నాము. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు మా బృందం నిరంతరం కృషి చేస్తోంది. మాపై చూపుతున్న ప్రేమ, మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరం. చాలా త్వరలో సానుకూల నిర్ణయంతో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాము. జరిగిన ఇబ్బందులకు హృదయపూర్వక క్షమాపణలు.”అని నిర్మాణ సంస్థ ప్రకటించింది.



ఈ అనూహ్య నిర్ణయం బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కలిగించినప్పటికీ, బోయపాటి – బాలకృష్ణ కాంబినేషన్‌ పై ఉన్న నమ్మకం మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ‘అఖండ’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య మాస్ క్రేజ్ ఆకాశాన్ని తాకిందని తెలిసిందే. అందుకే ‘అఖండ 2’ పై అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి.నిర్మాణ సంస్థ చెప్పినట్లుగా సమస్యలు త్వరగా పరిష్కారమై, భారీ అంచనాల నడుమ ‘అఖండ 2’ కొత్త తేదీతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: