సినీనటి ప్రత్యూష మృతి కేసు... సుప్రీం తీర్పుపై తీవ్ర ఉత్కంఠ... !
అయితే 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం ప్రత్యూష - సిద్ధార్థరెడ్డి ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రత్యూష మరుసటి రోజు, అంటే ఫిబ్రవరి 24న మరణించగా, సిద్ధార్థరెడ్డి చికిత్స అనంతరం మార్చి 9న డిశ్చార్జ్ అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్గోనోఫాస్పేట్ వల్ల మరణం సంభవించినట్టు వైద్యుల నివేదికలు నిర్ధారించాయి. ఆ సమయంలో ప్రత్యూష మరణంపై అనేక అనుమానాలు, వాదనలు వెల్లువెత్తాయి. రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యలు చేయడంతో కేసు పెద్ద చర్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు వైద్యుల బృందం ప్రత్యూషను ఊపిరాడనివ్వకుండా చంపారనే ఆధారాలు లేవని, మరణానికి ముందు లైంగిక దాడి జరగలేదని స్పష్టం చేసింది.
దీనిపై ఆధారంగా సీబీఐ దర్యాప్తును పూర్తి చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఆత్మహత్యాయత్నం కేసుల కింద చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సిద్ధార్థరెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల ఫైన్ విధించారు. హైకోర్టు ఈ శిక్షను రెండేళ్లకు తగ్గించి, జరిమానాను రూ.50 వేలుగా పెంచింది. ఈ తీర్పుతో అసంతృప్తిగాంచిన ప్రత్యూష తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గరిష్ఠ శిక్ష విధించాలని కోరారు. సిద్ధార్థరెడ్డి తరఫు న్యాయవాదులు పూర్తిగా విభిన్న వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. త్వరలో తుది తీర్పు వెలువడనుండటంతో ఈ కేసు మరోసారి తెలుగు ప్రజలు, తెలుగు సినిమా దృష్టిని ఆకర్షిస్తోంది.