కోర్ట్ సినిమాపై ' గ‌ర‌గ త్రినాధ‌రావు ' స‌మీక్ష‌... టైటిల్ మిస్టేక్ చేశారా..!

frame కోర్ట్ సినిమాపై ' గ‌ర‌గ త్రినాధ‌రావు ' స‌మీక్ష‌... టైటిల్ మిస్టేక్ చేశారా..!

RAMAKRISHNA S.S.
నాని నిర్మాత‌గా తెర‌కెక్కించిన కోర్ట్ సినిమా థియేటర్ల‌లో దూసుకుపోతోంది. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా చాలా మంది చాలా స‌మీక్ష‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌ర‌గ త్రినాధ‌రావు చేసిన స‌మీక్ష సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. త్రినాధ‌రావు స‌మీక్ష ప్ర‌కారం.

తెలుగు సినిమాలు చూస్తుంటే అసలు రివ్యూ రాయాలనిపించే విధంగా ఉండటం లేదు.. బహుశా ఓటీటీలలో మలయాళ,తమిళ సినిమాలకు బాగా అలవాటు పడిపోవడం కూడా ఓ ప్రధాన కారణం. మళయాళ క్రైం, థ్రిల్లర్ సినిమాలను పొగడడం అలవాటు చేసుకున్న నేను అనుకోకుండా కోర్ట్ సినిమా చూశాక రివ్యూ రాయకుండా ఉండలేకపోయాను.. నాని సొంత బ్యానర్‌లో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటించి, రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విషయానికి వస్తే.. మన సొసైటీలో ఎన్నో చట్టాలున్నా, ఆ చట్టాలపై మనకే అవగాహన ఉండదు. పోక్సో యాక్ట్.. అసలు పోక్సో చట్టం అంటే ఏంటి? దాన్ని మనం ఏవిధంగా ఉపయోగిస్తున్నాం. ఆ చట్టాన్ని మిస్ యూజ్ చేస్తున్నామా? ఈ విషయాలన్నింటిపైన అవగాహన కల్పిస్తూ అద్భుతంగా సినిమా తీశారు. సాధారణంగా కోర్టు రూమ్ డ్రామాలు తమిళ, మలయాళ భాషలలో చాలా వస్తున్నాయి.

ఆల్రెడీ జై భీమ్, విచారణ సినిమాలకు మనవాళ్లు గతంలో మంచి మార్కులే వేసేసారు. తెలుగులో ఇలాంటి సినిమాలు ఇప్పుడున్న తరానికి చాలా అవసరం. స్కూల్స్, కాలేజీలలో లీగల్ నాలెడ్జ్ తో కూడిన మంచి చెడులు కచ్చితంగా చెప్పాలన్న దర్శకుడు రామ్ జగదీష్ ఆలోచన ప్రశంసనీయం.. పోక్సో యాక్ట్ గురించి చాలా మందికి తెలీదు. అట్రాసిటీ కేసు మాదిరిగానే పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని కూడా చాలా మంది తప్పుగా వాడుతున్నారు. ఈ ‘కోర్ట్’ మూవీ ద్వారా ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు..అయితే ఈ సినిమాని మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు , రెండో భాగానికి వచ్చేసరికి కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. సెకండ్ హఫ్‌కి వచ్చే సరికి సినిమా కొంతవరకు సైడ్ ట్రాక్‌కి వెళుతుందా ? అనే అనుమానం కలుగుతుంది.మొత్తానికి పోక్సో చట్టం మీద దర్శకుడు ఎక్కు పెట్టిన విమర్శలు, చట్టంలోని లూప్ హోల్స్‌ను ప్రశ్నించిన తీరుకు ప్రేక్షకులు చక్కగా కనెక్ట్ అవుతారు.

ఇక నటీనటుల విషయానికొస్తే హర్ష రోషన్, శ్రీదేవి టీనేజ్ లవర్స్‌గా తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకి ప్రధాన బలం శివాజీ నటన. మంగపతి క్యారెక్టర్‌లో విలనిజాన్ని అద్భుతంగా పండించాడు శివాజీ. ఈ మూవీ అతనికి కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘90's’ వెబ్ సిరీస్‌లో మధ్యతరగతి తండ్రిగా కనిపించిన శివాజీ, ఇందులో అహంకారపు అల్లుడిగా కనిపించి, పూర్తి మార్కులు కొట్టేశాడు..ప్రియదర్శి, సాయికుమార్,నటన గురించి చెప్పాల్సిన పనే లేదు. సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే మెయిన్ హైలెట్ బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం. ప్రేమలో సాంగ్ ఇప్పటికే బాగా పాపులర్ అయింది.. సినిమాలో ఉన్న మిగిలిన రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కొత్త దర్శకుడు రామ్ జగదీష్. నాని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.చివరిగా నేటి సమాజానికి అవసరమైన కథ రాసుకొని, మంచి సమాచారంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చాడు దర్శకుడు.. సినిమా పేరు కోర్టు కాకుండా ఓ మంచి క్యాచీ టైటిల్ పెడితే సినిమా ఎక్కడికో వెళ్లిపోయేదని నా ఫీలింగ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: