కోర్ట్: చదువు చెప్పకపోయినా చట్టం గురించి అందరికి చెప్పాల్సిందే..!
సినిమాలో చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. చందు లైఫ్‌లోకి జాబిల్లి (శ్రీదేవీ) వస్తుంది. ఫోన్ కాల్స్ ద్వారా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ విషయం పరమ కోపిష్టి.. పరువు కోసం పరితపించే జాబిలి మామ మంగపతి (శివాజీ)కి తెలుస్తుంది. తమ ఇంట్లో అమ్మాయిలు కాస్త తేడాగా బట్టలు వేసుకున్నా సహించలేని మంగపతి చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు. తన లాయర్ దామోదర్ (హర్ష వర్దన్) మంగపతికి తోడుంటాడు. మరి చందుని బయటకు తీసుకు వచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు (సాయి కుమార్) అసిస్టెంట్ తేజ (ప్రియదర్శి) అబ్బాయి తరపున కేసు వాదించి చివరకు ఎలా గెలిపిస్తాడు ? అన్నదే ఈ సినిమా కథ.
కథనంలోకి వెళితే అసలు ఈ పోక్సో చట్టం ఏం చెబుతుంది ? దీన్ని తప్పుగా ఎలా వాడుకుని అమాయకుల్ని ఇరికిస్తా రు? చివరకు అమాయకుడైన చందుని ఎలా బయటకు తీసుకు వస్తారు.. ? వీటితో పాటు ఈ తరంలో ప్రతి ఒక్కరికి ఈ కోర్ట్ సినిమా గురించి తెలియాలి. పోక్సో చట్టం మీద అవగాహన లేక, తాము చేసేది చట్టరిత్యా నేరం అన్నది తెలియక చాలా మంది ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అసలు ఇలాంటి ఓ చట్టం ఉందని, ఇది చేస్తే తప్పు.. అది చేస్తే నేరం అని విడమరిచి చెప్పి, చట్టాల గురించి అందరికీ అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
చదువు అందరికీ చెప్పినా చెప్పకపోయినా.. చట్టం గురించి అందరికీ చెప్పాలనే బలమైన పాయింట్‌ను ఆడియెన్స్ మైండ్‌లోకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఓ మైనర్ అమ్మాయిని ప్రేమించినా, ఆమె అంగీకారంతో ముట్టుకున్నా కూడా అది నేరం అవుతుందని ఎంత మందికి తెలుసు ? అనే ఓ ప్రశ్నను ప్రియదర్శి పాత్రతో లేవనెత్తాడు దర్శకుడు. పోక్సో చట్టం మీద దర్శకుడు ఎక్కు పెట్టిన విమర్శలు, చట్టంలోని లూప్ హోల్స్‌ను ప్రశ్నించిన తీరు బాగుంటుంది. ఖచ్చితంగా ఈ తరం యువత అందరూ ఈ సినిమాను చూడాలి.