గేమ్ ఛేంజర్ స్టోరీ లీక్ చేసిన శంకర్.. రామ్ చరణ్ నటనపై ప్రశంసలు!
శంకర్ మాట్లాడుతూ తన 30 ఏళ్ల సినీ ప్రయాణంలో 14 సినిమాలు డైరెక్ట్ చేశానని, కానీ ఒక్క స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయలేదని అన్నారు. "అపరిచితుడు", "రోబో" వంటి డబ్బింగ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, రామ్ చరణ్, దిల్ రాజు సహకారంతో తన కల నెరవేరిందని చెప్పారు.
"గేమ్ ఛేంజర్" పూర్తిగా తెలుగు సినిమా అని, నటీనటులు, టెక్నీషియన్లు, లొకేషన్లు అన్నీ తెలుగు వారితో, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసినట్లు శంకర్ వెల్లడించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే, ఒక కలెక్టర్, మినిస్టర్ మధ్య జరిగే పోరాటం ప్రధానాంశంగా ఉంటుందని, హీరో పాత్ర వెనుక ఒక రహస్య కథ ఉంటుందని, అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని శంకర్ అన్నారు.
రామ్ చరణ్ నటన గురించి శంకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రామ్ చరణ్ సినిమాలో నటించలేదని, జీవించాడని, సినిమా చూస్తున్నంతసేపు రామ్ చరణ్ కాకుండా కేవలం పాత్ర మాత్రమే కనిపిస్తుందని, అంత సహజంగా ఆయన నటించారని కొనియాడారు. రామ్ చరణ్‌కు తన ధన్యవాదాలు తెలుపుతూ, అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్ వంటి నటీనటులకు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. శంకర్ సినిమా కథలోని కీలక అంశాలను వెల్లడించడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. "గేమ్ ఛేంజర్" ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.